రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు

December 07, 2019


img

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శనివారం జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు అయ్యింది. శాయంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల గోవిందాపూర్ గ్రామంలో నివశిస్తున్న 24 ఏళ్ళ యువతి కనిపించడంలేదంటూ ఆమె కుటుంబ సభ్యులు వరంగల్‌ సుబేదారీ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్‌ కేసు నమోదు చేసుకొని ఆ కేసును శాయంపేట పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు.  

దిశ కేసుకు సంబందించి ఆమె తల్లితండ్రులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు పోలీసులు వారితో చాలా అనుచితంగా మాట్లాడటమే కాకుండా, ఆ కేసు తమ పరిధిలోకి రాదంటే తమ పరిధిలోకి రాదంటూ రెండు పోలీస్‌స్టేషన్ల మద్య తిప్పించుకొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి తిరస్కరించారు. వారి అలసత్వం వలననే దిశ చాలా దారుణంగా అత్యాచారానికి గురై ప్రాణం కోల్పోయిందని రాష్ట్ర ప్రజలందరూ పోలీసుల తీరుపై మండిపడ్డారు. 

కనుక రాష్ట్ర పోలీస్ శాఖ ఆ పొరపాటును సరిదిద్దుకొంటూ ఇక నుంచి రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా రాష్ట్రంలో ఏ పోలీస్‌స్టేషన్‌లోనైనా ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’తో తప్పనిసరిగా కేసు నమోదు చేసుకోవాలని నిర్ణయించింది. 

ఇది చాలా మంచి నిర్ణయమే అయితే కేవలం జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే గొప్పని భుజాలు చరుచుకొంటే సరిపోదు. కేసు తీవ్రతను బట్టి అవసరమైతే రెండు పోలీస్‌స్టేషన్లకు చెందిన పోలీసులు ఆ కేసుపై వెంటనే దర్యాప్తు కూడా ప్రారంభిస్తే వీలైనంత త్వరగా నేరస్తులనుపట్టుకోగలుగుతారు. 

ఈరోజు వరంగల్‌లో నమోదైన కేసులో 24 ఏళ్ళ యువతి కనబడకపోవడం చాలా సీరియస్ విషయం తప్ప జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం గొప్ప విషయం కాదు. కనుక ఆమెకు ఎటువంటి హానీ కలుగక మునుపే పోలీసులు కాపాడగలిగితే జీరో ఎఫ్‌ఐఆర్‌ వలన ఆశించిన ప్రయోజనం లభించినట్లవుతుంది. 


Related Post