ఆర్టీసీ ప్రైవేటీకరణపై స్టే తొలగించలేము: హైకోర్టు

November 21, 2019


img

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పడంతో అయోమయంలో పడిన ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధులలో చేరేందుకు సిద్దపడ్డారు. అయితే హైకోర్టు ప్రభుత్వానికి కూడా ఒక షాక్ ఇచ్చింది. ఆర్టీసీ ప్రైవేటీకరణపై విధించిన స్టేను హైకోర్టు తొలగించడానికి నిరాకరించింది. దాంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడింది. 

ఆర్టీసీ ప్రైవేటీకరణపై బుదవారం హైకోర్టు విచారణ చేపట్టినప్పుడు, తొలుత ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పు కాదన్నట్లు మాట్లాడింది. అయితే ఆర్టీసీ ప్రైవేటీకరించాలనేది మంత్రివర్గ నిర్ణయమే అయినప్పటికీ 5,100 ప్రైవేట్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడంపై నిషేధం విదిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అసలు ఆర్టీసీ విభజన ప్రక్రియే ఇంకా పూర్తికానప్పుడు దానిని ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు చాలా కసరత్తు చేయవలసి ఉన్నందున స్టే పొడిగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. 

ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టు స్టే కొనసాగించడం వలన ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలకు భద్రత ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది కనుక ఆర్టీసీ కార్మికులకు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే.


Related Post