బేషరతుగా సమ్మె విరమణకు సిద్దం: ఆర్టీసీ జేఏసీ

November 20, 2019


img

ఆర్టీసీ సమ్మె కేసు కార్మిక న్యాయస్థానానికి బదిలీ అవడంతో అయోమయంలో పడిన ఆర్టీసీ కార్మిక సంఘాలు సుదీర్గంగా చర్చించుకొన్న తరువాత బేషరతుగా సమ్మె విరమించాలని నిర్ణయించుకొన్నాయి. 

ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కార్మికుల సమస్యలను, ప్రజల ఇబ్బందులను, కోర్టు తీర్పును  దృష్టిలో పెట్టుకొని బేషరతుగా సమ్మె విరమించాలని నిర్ణయించుకొన్నాము. కనుక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము. ప్రభుత్వం కూడా ఎటువంటి షరతులు, ఆంక్షలు విధించకుండా అక్టోబర్ 4వ తేదీన ఆర్టీసీలో ఎటువంటి పరిస్థితి ఉండేదో అదే పరిస్థితిలో బేషరతుగా చేరేందుకు అంగీకరించాలని కోరుతున్నాము. సమ్మె నేపధ్యంలో ఆర్టీసీ కార్మికులపై భవిష్యత్‌లో ఎటువంటి కక్ష సాధింపు చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. కార్మికులు డ్యూటీ ఛార్జ్ షీట్లపై మాత్రమే సంతకాలు చేసి విధులలో చేరుతారు. ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే రేపటి నుంచే ఆర్టీసీ కార్మికులు అందరూ విధులలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు. 

ప్రభుత్వం కోరుకొన్నట్లుగానే ఆర్టీసీ కార్మికులు బేషరతుగా విధులలో చేరేందుకు సిద్దపడ్డారు కనుక ఇప్పుడు ప్రభుత్వం వారిని విధులలో తీసుకొంటుందనే అందరూ ఆశిస్తున్నారు. ప్రభుత్వం (సిఎం కేసీఆర్‌) ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.  



Related Post