గవర్నర్‌ సమయం ఇస్తున్నారు కానీ కేసీఆర్‌ మాత్రం...

November 20, 2019


img

అఖిలపక్ష నేతలు బుదవారం ఉదయం రాజ్‌భవన్‌ వెళ్ళి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఆర్టీసీ సమ్మె తదనంతర పరిణామాలను ఆమెకు వివరించి ఆర్టీసీ కార్మికులు సమస్యను పరిష్కరించమని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్‌ ఆర్టీసీ సమ్మెపై మాట్లాడేందుకు ప్రతిపక్షాలకు, ఆర్టీసీ జేఏసీ నేతలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. కానీ ఈ సమస్యను పరిష్కరించవలసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో గిరిగీసుకొని కూర్చొని సమస్యను ఇంకా జటిలం చేస్తున్నారు. ఈ సమస్యపై గవర్నర్‌కు ఉన్న శ్రద్ద ఆయనకు లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఆర్టీసీ కార్మికులు 47 రోజులుగా సమ్మె చేస్తున్నా, 28 మంది చనిపోయినప్పటికీ సిఎం కేసీఆర్‌కు చీమ కుట్టినట్లైనా లేదు. తాను ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధిననే విషయం మరిచిపోయి చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు కనుకనే మేము గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయవలసి వచ్చింది. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్‌లో రాజకీయ ఆరోపణలు చేయడంపై కూడా మేము గవర్నర్‌కు ఫిర్యాదు చేశాము. ఇకనైనా సిఎం కేసీఆర్‌ మొండిపట్టు వీడి ఆర్టీసీ కార్మికులను తక్షణం బేషరతుగా విధులలోకి తీసుకోవాలని కోరుతున్నాము. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కాదనుకొంటే డిల్లీ వెళ్ళి ఈ వ్యవహారంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకొని పరిష్కరించవలసిందిగా కోరుతాము,” అని అఖిలపక్ష నేతలు అన్నారు.

గవర్నర్‌ను కలిసిన వారిలో గీతారెడ్డి (కాంగ్రెస్‌), చాడా వెంకట రెడ్డి(సిపిఐ), కోదండరాం (టిజేఎస్‌) రావుల చంద్రశేఖర్ రెడ్డి (టిడిపి), మోహన్ రెడ్డి (బిజెపి), ఎల్.రమణ (టిడిపి), ఇంకా సిపిఎం తదితర నేతలున్నారు.


Related Post