విలీనం డిమాండ్‌ వదులుకొన్నాం...చర్చలకు పిలవండి!

November 14, 2019


img

హైదరాబాద్‌లోని ఈయు కార్యాలయంలో గురువారం ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. వారు ఈ సమావేశంలో 41 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె, జరుగుతున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై లోతుగా చర్చించారు. 

అనంతరం ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మా డిమాండ్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టాము. కనుక మిగిలిన 25 డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నాము. మావైపు నుంచి మేము స్పందించాము కనుక ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. 

ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె కొనసాగిస్తాము. దానిలో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాము. ఈ నెల 16న నగరంలోని ఇందిరా పార్క్‌ వద్ద ఆర్టీసీ జేఏసీ నేతలందరూ దీక్ష చేస్తారు. నవంబర్ 17, 18 తేదీలలో డిపోలవద్ద నిరసన దీక్షలు, 19న హైదరాబాద్‌ నుంచి కోదాడ వరకు సడక్ బంద్‌ కార్యక్రమం నిర్వహిస్తాము. చనిపోయిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులను వెంటబెట్టుకొని త్వరలోనే గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి పరిస్థితిని వివరించి మా సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతాము. ఆ తరువాత ఎన్‌హెచ్‌ఆర్సీని కలిసి ఫిర్యాదు చేస్తాము,” అని తెలిపారు. 

ఈరోజు జరిగిన సమావేశానికి ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, కో-కన్వీనర్ రాజిరెడ్డి, టిజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, కాంగ్రెస్‌ తరపున వి.హనుమంతరావు, బిజెపి నుంచి మోహన్ రెడ్డి, సిపిఐ నుంచి పల్లా వెంకట్ రెడ్డి, సుధాకర్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


Related Post