రఫేల్...ఆల్ క్లియర్

November 14, 2019


img

రఫేల్ యుద్దవిమానాల కొనుగోలు వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు మరోసారి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని, దానిపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు 2018, సెప్టెంబరులో విచారణ జరిపి కేంద్రప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చి, ఆ కేసులన్నిటినీ కొట్టివేసింది. 

మాజీ కేంద్రమంత్రులు అరుణ్ శౌరి, యశ్వంత్ సిన్హా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తదితరులు మళ్ళీ దానిపై సుప్రీంకోర్టులో వేర్వేరుగా రివ్యూ పిటిషన్లు వేశారు. వాటిపై మళ్ళీ విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం, రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలుపై గతంలో ఇచ్చిన తీర్పునే ఈరోజు మరోసారి పునరుద్గాటించింది. ఆ తీర్పును పునః సమీక్షించనవసరం లేదని స్పష్టం చేసింది. కనుక రఫేల్ కొనుగోలు వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ తీర్పు చెప్పారు. 

గతంలో యూపీఏ ప్రభుత్వం 2012లో ఒక్కోటి రూ.670 కోట్ల ఖరీదు చేసే 126 రఫేల్ యుద్ధవిమానాలను మొత్తం రూ.68,000 కోట్లు వ్యయంతో దసో ఏవియేషన్ సంస్థనుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఒక్కోదానికి రూ.1,600 కోట్లు చొప్పున 36 యుద్ధవిమానాలను మొత్తం రూ.58,000 కోట్లు వ్యయంతో  కొనుగోలు చేయడానికి అదే సంస్థతో ఒప్పందం చేసుకొంది.

యూపీఏ ప్రభుత్వం రూ.68,000 కోట్లతో 126 రఫేల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొన్నప్పుడు, మోడీ ప్రభుత్వం అవే విమానాలకు మూడు రేట్లు ఎక్కువ ధర చెల్లించి 36 యుద్ధవిమానాలకే రూ.58,000 కోట్లు చెల్లించడానికి సిద్దపడ్డారని, యుద్ధవిమానాలు లేదా వాటి పరికరాలు తయారుచేయడంలో ఎటువంటి అనుభవం లేని రిలయన్స్ సంస్థ అధినేత అనీల్ అంబానీకి భారీగా లబ్ది కలిగించేందుకు ఈ ఒప్పందంలో భాగస్వామిగా చేర్చారని ప్రధాన ఆరోపణలు. వీటిపై సుదీర్గంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు నేడు ఆ వ్యవహారంలో ఎటువంటి లోపాలు లేవని తీర్పు చెప్పి మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చింది. 


Related Post