తెలంగాణ బంద్‌ సంపూర్ణం...23న ఓయూలో సభ

October 19, 2019


img

ఆర్టీసీ సమ్మెలో భాగంగా నేడు జరిగిన తెలంగాణ బంద్‌కు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించడంతో ఆశించిన స్థాయి కంటే విజయవంతం అయ్యింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌తో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. అక్కడక్కడ కొన్ని బస్సులు తిరిగినా ఆందోళనకారులకు భయపడి మళ్ళీ డిపోలలో పెట్టేశారు. నేటి నుంచి క్యాబ్‌లు కూడా సమ్మె ప్రారంభించడంతో ప్రజలు ఆటోలు, వ్యాన్‌లను ఆశ్రయించక తప్పలేదు. బంద్‌ కారణంగా హైదరాబాద్‌ మెట్రో, ఎంఎంటిఎస్ రైళ్ళు మాత్రం కిటకిటలాడాయి. 

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బంద్‌లో పాల్గొని విజయవంతం చేసిన వారందరికీ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వధామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. యావత్ తెలంగాణ సమాజం బంద్‌లో పాల్గొని నిరసనలు తెలియజేసినప్పటికీ తెరాస సర్కార్‌లో స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆర్టీసీ సమ్మె కొనసాగిస్తామని అన్నారు. 

ఈరోజు సాయంత్రం బంద్‌ ముగియగానే ఆర్టీసీ జేఏసీ నేతలు నేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈనెల 23న ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని పార్టీలతో కలిసి బహిరంగసభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. రేపు ఉదయం ప్రతిపక్షనాయకులను కలిసి ఆ సభకు ఆహ్వానించనున్నారు. రేపు సాయంత్రంలోగా ఆర్టీసీ సమ్మెలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని అశ్వధామరెడ్డి తెలిపారు.


Related Post