స్కార్పియోలోనే ఆరుగురు స్నేహితులు జల సమాధి

October 19, 2019


img

శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లాలోని చాకిరాల గ్రామం వద్ద  సాగర్ ఎడమకాలువలోకి దూసుకుపోయిన  స్కార్పియో వాహనాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శనివారం మధ్యాహ్నం క్రేన్ సాయంతో వెలికి తీశాయి. దానిలో ప్రయాణిస్తున్న పవన్ కుమార్ (23), సంతోష్ కుమార్ (23), రాజేష్ (29), జాన్సన్ (33), నాగేశ్ (35), అబ్దుల్ అజీత్ (45) బయటకు రాలేక లోపల చిక్కుకొని చనిపోయారు. 

మృతులందరూ హైదరాబాద్‌ ఈసీఐఎల్‌ సమీపంలోని అంకుర ఆస్పత్రిలో పనిచేస్తున్నవారే. అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవరుగా పనిచేస్తున్న తమ స్నేహితుడు విమలకొండ మహేశ్ పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘోరప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న ఒక గుంతను తప్పించబోతే స్కార్పియో అదుపు తప్పి నాగార్జునసాగర్ ఎడమకాలువలోకి దూసుకుపోయినట్లు వెనుక వేరే కారులో వస్తున్న వారి స్నేహితులు తెలిపారు. 

వెంటనే వారు స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించినప్పటికీ ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తుండటం, సాగర్ కాలువ ఉదృతంగా ప్రవహిస్తుండటంతో స్కార్పియోను గుర్తించడం కష్టంగా మారింది. తెల్లవారుజామున సాగర్ గేట్లను మూసి ప్రవాహం తగ్గగానే గజ ఈతగాళ్ళు నీళ్ళలోకి దిగి స్కార్పియోకు ఇనుప వైరును తగిలించి క్రేన్ సాయంతో బయటకు తీశారు. 

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్కార్పియోలో నుంచి వారి శవాలను బయటకు తీసి పోలీసులకు అప్పగించాయి. వారి మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాలను వారి బందువులకు అప్పగించనున్నారు. చనిపోయినవారి బందుమిత్రుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Related Post