చర్చలు లేవు! సమ్మె, తెలంగాణ బంద్‌ యధాతధం

October 19, 2019


img

ఆర్టీసీ జేఏసి నేతలు తమ సమ్మెలో భాగంగా నేడు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించాయి. బంద్‌కు ఉద్యోగ, ఉపాద్యాయ, ప్రజాసంఘాలు, క్యాబ్, ఆటోరిక్ష యూనియన్లు మద్దతు పలికాయి.

బంద్‌ జరిగితే రాష్ట్రం నష్టపోతుంది...రాష్ట్ర ప్రతిష్ట మసక బారుతుందని తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వం బంద్‌ జరుగకుండా నివారించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోగా ప్రశాంతంగా బంద్‌ నిర్వహించుకుంటే అభ్యంతరం లేదని హైకోర్టుకు చెప్పడం విస్మయం కలిగిస్తుంది. ప్రభుత్వానికి కూడా అభ్యంతరం లేదు కనుక ఈరోజు తెలంగాణ బంద్‌ సంపూర్ణం కాబోతోందని భావించవచ్చు. తెలంగాణ బంద్‌కు ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు, వివిద సంఘాలు కలిసి సిద్దం అవుతున్నారు. 

ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చర్చలకు ముందుకు రాకపోవడంతో హైకోర్టు చొరవ తీసుకొని ఈరోజు ఉదయం 10.30లోగా ఆర్టీసీ జేఏసి నేతలను చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నేటి నుంచి మూడు రోజులలోగా చర్చలు ముగించాలని గడువు కూడా విధించింది. కానీ ఆర్టీసీ జేఏసి నేతలతో చర్చలు జరుపకూడదని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తాజా సమాచారం. ఇదే నిజమైతే ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలను మరింత రెచ్చగొట్టినట్లవుతుంది కనుక నేడు సమ్మె మరింత ఉదృతం చేసి బంద్‌ను సంపూర్ణం చేయడానికి అందరూ గట్టిగా ప్రయత్నించడం ఖాయం. 


Related Post