తెరాస సర్కార్‌కు హైకోర్టు డెడ్‌లైన్‌

October 18, 2019


img

ఆర్టీసీ సమ్మెపై తెరాస సర్కార్‌ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. ఈరోజు మధ్యాహ్నం విచారణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ న్యాయవాదిని పలుమార్లు న్యాయమూర్తి నిలదీశారు. ఆర్టీసీకి ఎండీని నియమించాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఎందుకు నియమించలేదని ప్రశ్నించగా సమర్దుడైన అధికారి ఆర్టీసీ ఇంఛార్జ్ గా ఉన్నందున ఎండీని నియమించలేదని న్యాయవాది సమాధానం చెప్పారు. దానిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సమర్దుడైతే అతనినే ఎండీగా నియమించవచ్చు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

ఆర్టీసీ కార్మికులు అడుగుతున్న జీతాల పెంపు, మౌలికసదుపాయాల కల్పన, మెరుగైన వైద్య సౌకర్యాలు, బస్సుల మరమత్తుల కోసం అవసరమైన పరికరాల కొనుగోలు వంటివన్నీ అవసరమైనవే కదా?మరి ప్రభుత్వం ఎందుకు వెనకడుతోంది? అని ప్రశ్నించారు. అసలు కార్మిక సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఎందుకు అయిష్టత చూపుతోంది? అని న్యాయమూర్తి గట్టిగా నిలదీశారు. 

ప్రభుత్వ న్యాయవాది సమాధానాల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి, శనివారం ఉదయం 10.30 గంటల లోపు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు ప్రారంభించాలని, మూడు రోజులలోగా చర్చలు ముగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. 

సమ్మె కొనసాగుతుండటం వలన మారుమూల ప్రాంతాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, కనుక తక్షణం చర్చలు ప్రారంభించి వీలైనంత త్వరగా సమ్మెను ముగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ప్రజలు తిరుగబడితే పరిస్థితులు అదుపుతప్పుతాయని, అప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని కనుక అటువంటి పరిస్థితులు రాకమునుపే జాగ్రత్తపడమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. 


Related Post