సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా శరత్ అరవింద్ బోబ్డే

October 18, 2019


img

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేస్తుండటంతో తన స్థానంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి అయిన శరత్ అరవింద్ బోబ్డే పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయశాఖకు లేఖ వ్రాశారు. సాధారణంగా సుప్రీంకోర్టు కొలీజియమ్ సిఫార్సు చేసినవారినే ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం ఆనవాయితీ కనుక కేంద్ర న్యాయశాఖ ఆయన నియామక ఉత్తర్వులను సిద్దం చేస్తోంది. జస్టిస్ రంజన్ గగోయ్ పదవీ విరమణ చేసిన మరునాడే ఆయన సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.   

మహారాష్ట్రకు చెందిన శరత్ అరవింద్ బోబ్డే తండ్రి, సోదరుడు ఇద్దరూ కూడా న్యాయవాదులే. ఆయన తండ్రి అరవింద్ బోబ్డే 1980-85 వరకు మహారాష్ట్ర ఆడవాకేట్ జనరల్‌గా పనిచేశారు. సోదరుడు వినోద్ బాబ్డే సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా చేశారు. 

శరత్ అరవింద్ బోబ్డే నాగపూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. 1978లో బొంబే హైకోర్టు యొక్క నాగపూర్ బెంచ్‌లో న్యాయవాదిగా చేరారు. 2000 సంలో బొంబే హైకోర్టులో అధనపు జడ్జీగా నియమితులయ్యారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నిల్యమితులయ్యారు. ఈవిధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ చివరికి అత్యున్నతమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టబోతున్నారు.


Related Post