ఆర్టీసీ జెఏసీతో చర్చలు ఎలా?

October 17, 2019


img

టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు-రాష్ట్ర ప్రభుత్వం చర్చించుకొని తక్షణం సమ్మె విరమణ చేయాలని, శుక్రవారం జరిగే తదుపరి విచారణలో దీనిపై ఇరువర్గాలు సంతృప్తికరమైన సమాధానంతో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన సంగతి అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆర్టీసీకి తక్షణం మేనేజింగ్ డైరెక్టరును నియమించాలని కూడా ఆదేశించింది. టిఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు హైకోర్టు ఆదేశాలను స్వాగతించి తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్దమేనని ప్రకటించాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం తరపున ఎవరూ హైకోర్టు ఆదేశాలపై స్పందించలేదు. 

హైకోర్టు ఆదేశాల నేపద్యంలో సిఎం కేసీఆర్‌ బుదవారం ప్రగతి భవన్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఆర్టీసీ జెఏసీతో ప్రభుత్వం తరపున ఈసారి ఎవరు చర్చలు సాగించాలి? ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఏవిధంగా స్పందించాలి? ఆర్టీసీ ఎండీగా ఎవరిని నియమించాలి? తదితర అంశాలపై చర్చించారు. 

ఈసారి ఆర్టీసీ జెఏసీతో మంత్రుల కమిటీ ద్వారా చర్చలు సాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆర్టీసీ ఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారులు స్టీఫెన్ రవీంద్ర, ఆకూన్ సబర్వాల్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, శివధర్ రెడ్డిలలో ఒకరిని నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. గురువారం సాయంత్రంలోగా ఆర్టీసీ ఎండీ నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రేపు ఈ కేసుపై మళ్ళీ హైకోర్టులో విచారణ జరిగినప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలియజేసి, కోర్టు సూచనల మేరకు ఆర్టీసీ జెఏసీతో చర్చలు ప్రారంభించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. 

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఈనెల 19న తెలంగాణ బంద్‌కు ఆర్టీసీ జెఏసీ పిలుపునీయగా, ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి. కనుక ఆలోగా చర్చలు ప్రారంభం కాకపోతే బంద్‌ అనివార్యమవుతుంది. కనుక ప్రభుత్వం చురుకుగా నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఉంది.


Related Post