ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు..రేపు కార్యాచరణ

October 15, 2019


img

ఎట్టకేలకు ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవోలు మద్దతు ప్రకటించారు. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో టీఎన్జీవోల కీలకసమావేశంలో ఆర్టీసీ సమ్మెపై చర్చించిన తరువాత వారికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. బుదవారం మధ్యాహ్నం మళ్ళీ మరోసారి సమావేశమయ్యి భవిష్య కార్యాచరణపై చర్చించి ప్రకటన చేస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి తెలిపారు. ఇరువురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తమను చాలా బాధించిందని, ఇకపై ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. టీఎన్జీవోలు మద్దతు ప్రకటించిన వెంటనే ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి తదితరులు టీఎన్జీవో కార్యాలయానికి వెళ్ళి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమసమయంలో అందరం కలిసి పొరాడి రాష్ట్రాన్ని సాధించుకొన్నామని, అలాగే ఇప్పుడు అందరూ కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాడుదామని అశ్వథామరెడ్డి అన్నారు.

టీఎన్జీవోలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికినందున సమ్మె తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కానీ శుక్రవారంలోపు ఆర్టీసీ కార్మికులు-ప్రభుత్వం చర్చించుకొని సమ్మెను ముగించాలని హైకోర్టు ఈరోజు గడువు విధించింది కనుక ఇప్పుడు టీఎన్జీవోల మద్దతు వలన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒకవేళ చర్చలు మళ్ళీ విఫలమై సమ్మె కొనసాగితే అప్పుడు టీఎన్జీవోలు ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికినట్లయితే ప్రభుత్వంపై తప్పకుండా ఒత్తిడి పెరుగుతుంది. కానీ అటువంటి పరిస్థితులు రాకుండానే సమ్మె ముగిస్తే అందరికీ మంచిది.


Related Post