మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం

October 14, 2019


img

సోమవారం మధ్యాహ్నం మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుసుకొన్నాడు. హైదరాబాద్‌లో హెచ్‌సీయు డిపోకు చెందిన బస్‌ కండక్టర్ సందీప్ బ్లేడుతో చేతిని కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే పక్కనే ఉన్న ఆర్టీసీ కార్మికులు అడ్డుకొని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చేతిపై బ్లేడుతో కోసుకోవడం వలన నరాలు తెగి చాలా రక్తం పోయింది. కానీ వైద్యులు మళ్ళీ రక్తం ఎక్కించి అతని ప్రాణాలు కాపాడారు. 

నిన్న ఆత్మహత్య చేసుకొన్న ఆర్టీసీ కార్మికుడు సురేందర్ గౌడ్ తన కూతురు పెళ్ళికి చేసిన అప్పును వాయిదాల పద్దతిలో చెల్లిస్తున్నాడు. కానీ ఈనెల జీతాలు పడకపోవడంతో వాయిదా చెల్లించలేకపోయాడు. సమ్మె చేస్తున్న కార్మికులను మళ్ళీ పనిలోకి తీసుకోమని మంత్రులు, సిఎం కేసీఆర్‌ పదేపదే చెపుతుండటంతో, ఇకపై ఏవిధంగా కుటుంబాన్ని పోషించుకోవాలనే దిగులుతో సురేందర్ గౌడ్ ఆత్మహత్య చేసుకొన్నారని కుటుంబ సభ్యులు చెప్పారు. ఈరోజు ఆత్మహత్యాయత్నం చేసుకొన్న సందీప్ కూడా ఈనెల జీతం చేతికి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం. బహుశః ఆర్టీసీ కార్మికులలో చాలామంది ఇటువంటి పరిస్థితులే ఎదుర్కొంటుండవచ్చు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కాలానికి జీతాలు చెల్లించబోమని ప్రభుత్వం అంటే ఎవరూ తప్పు పట్టలేరు కానీ సమ్మె చేస్తున్నారనే వంకతో క్రిందటి నెల జీతాలను చెల్లించకపోవడం చాలా హేయమైన చర్య. ఆర్టీసీ కార్మికులను ఆర్ధికంగా ఇబ్బందిపడితేనే సమ్మె విరమించి కాళ్ళబేరానికి వస్తారనే ఆలోచన దారుణం. అటువంటి హేయమైన ఆలోచనకు రెండు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈరోజు మరో ప్రాణం పోయుండేది. అందుకే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలేనని ప్రతిపక్షాలు, ఆర్టీసీ కార్మికులు వాదిస్తున్నారు. 

ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి సగటున నెలకు రూ.50,000 చొప్పున జీతం చెల్లిస్తోందని సిఎం కేసీఆర్‌ చెప్పారు. అదే నిజమైతే ఒక నెల జీతం అందడం ఆలస్యం కాగానే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నం ఎందుకు చేసుకొంటున్నట్లు? ఈ అవాంఛనీయమైన పరిణామాలు ఆర్టీసీ కార్మికులు ఎంత దయనీయమైన జీవితాలు గడుపుతున్నారో అద్దం పడుతున్నాయి. కనుక ఆర్టీసీ యాజమాన్యం ముందుగా కార్మికులకు చెల్లించవలసిన జీతాలు చెల్లించి ఆ తరువాత చర్చలు మొదలుపెట్టడం మంచిది లేకుంటే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో ఎవరూ ఊహించలేరు. 



Related Post