ఆర్టీసీ సమ్మెపై టిఎన్జీవోల స్పందన

October 14, 2019


img

ఆర్టీసీ కార్మిక సంఘాల జెఏసీ నేతలు తమ సమ్మెకు మద్దతు కోరేందుకు టిఎన్జీవో నేతలను కలవాలనుకొన్నప్పుడు, టిఎన్జీవో నేతలకు అకస్మాత్తుగా ప్రగతి భవన్‌ నుంచి పిలుపురావడంతో వారు వెళ్ళి సిఎం కేసీఆర్‌తో భోజన సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో సిఎం కేసీఆర్‌ వారి సమస్యలపై చర్చించి తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ సమ్మెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సిఎం కేసీఆర్‌, టిఎన్జీవోలు ఆర్టీసీ జెఏసికి మద్దతు ఇవ్వకూడదని కోరుకోవడం సహజమే కనుక ఆయన ముందుజాగ్రత్తపడ్డారని సరిపెట్టుకోవచ్చు. కానీ తాము మద్దతు కోరేందుకు వస్తున్నామని తెలిసీ టిఎన్జీవో నేతలు సిఎం కేసీఆర్‌ను కలవడానికి వెళ్లిపోయారని ఆర్టీసీ జెఏసి నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ప్రభుత్వానికి అమ్ముడుపోయారు కనుకనే సిఎం కేసీఆర్‌తో కలిసి ప్రగతి భవన్‌లో విందుభోజనం చేసివచ్చారని ఆర్టీసీ జెఏసి నేతలు ఆరోపించారు. 

ఆర్టీసీ సమ్మెపై తమ వైఖరిని నిర్ణయించుకునేందుకు టిఎన్జీవో నేతలు నిన్న హైదరాబాద్‌లో అత్యవసర సమావేశం నిర్వహించుకున్నారు. అనంతరం టిఎన్జీవోల అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్టీసీ జెఏసి నేతల ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. మా సమస్యలను పరిష్కరించుకోవడానికే మేము ప్రగతి భవన్‌ వెళ్ళి సిఎం కేసీఆర్‌తో భేటీ అయ్యాము. మధ్యాహ్నం భోజనసమయం అవడంతో సిఎం కేసీఆర్‌ మమ్మల్ని భోజనానికి ఆహ్వానించారు. అంతమాత్రాన్న మేము ప్రభుత్వానికి అమ్ముడుపోయామనడం సరికాదు. మేము ఆర్టీసీ జెఏసి క్రింద పనిచేయడంలేదు కనుక వారు మాపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు మానుకుంటే మంచిది. అసలు వారు మాతో మాట్లాడకుండానే మమ్మల్ని ఏవిధంగా బాధ్యులమని నిందిస్తారు? వారి డిమాండ్లు న్యాయమైనవేనని మేము భావిస్తున్నాము. ఒకవేళ వారికి మద్దతు కావాలనుకుంటే మమ్మల్ని కలిసి కోరితే ఆలోచిస్తాము,” అని అన్నారు.


Related Post