ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వమే కారణం: భట్టి

October 07, 2019


img

ఆర్టీసీ సమ్మెను ఉక్కుపాదంతో అణచివేయాలనే సిఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తప్పు పట్టారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాలలో నుంచి తొలగించాలనుకోవడం సిఎం కేసీఆర్‌ నియంతృత్వానికి పరాకాష్ట. కార్మిక చట్టాల ప్రకారం వారు తమ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం శాంతియుతంగా సమ్మె చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారితో చర్చించి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని ముందుగానే నిశ్చయించుకున్న సిఎం కేసీఆర్‌ తూతూ మంత్రంగా ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపించి, అవి విఫలమయ్యాయనే సాకుతో తన నిర్ణయాన్ని అమలుచేయడానికి సిద్దం అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్‌పై వచ్చే పన్నును వదులుకోవడానికి ఇష్టపడకపోవడం వలననే ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోతోంది తప్ప ఆర్టీసీ కార్మికుల వలన కాదు. కానీ సిఎం కేసీఆర్‌ కార్మికుల కారణంగానే ఆర్టీసీ నష్టపోతోందనే సాకుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి సిద్దం అవుతున్నారు. ఆర్టీసీలో వేలాది కార్మికులను ఉద్యోగాలలో నుంచి పీకేస్తామని సిఎం కేసీఆర్‌ బెదిరించడం ఆయన అహంభావానికి అద్దం పడుతోంది. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది,” అని భట్టి విక్రమార్క అన్నారు.


Related Post