ఆర్టీసీ సమ్మె తాజా అప్‌డేట్స్

October 07, 2019


img

నేటితో ఆర్టీసీ కార్మికుల సమ్మె 3వ రోజుకు చేరింది. ఆర్టీసీ జెఏసీ నేతలు నేటి నుంచి ఇందిరాపార్క్ వద్ద నిరవదిక నిరాహార దీక్ష మొదలుపెట్టాలనుకున్నారు కానీ పోలీసులు అనుమతించకపోవడంతో దీక్షను వాయిదా వేసుకున్నారు. సోమవారం ఉదయం జెఏసీ నేతలు ఆర్టీసీ కార్మికులతో కలిసి గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించడానికి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ అయినవారిలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వథామరెడ్డి, ఐకాస నేత రాజిరెడ్డి తదితరులున్నారు. “అమరవీరులకు నివాళులు అర్పించడానికి కూడా అనుమతించరా...?” అంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

సిఎం కేసీఆర్‌ నిన్న చెప్పినదాని ప్రకారం సుమారు 50,000 మంది ఆర్టీసీ కార్మికులలో 1,200 మంది మాత్రమే తిరిగివచ్చి విధులు నిర్వహిస్తున్నారు. కనుక మిగిలిన వారీనందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించి వారిస్థానంలో కొత్తవారిని నియమిస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించడంతో వాటికోసం నిరుద్యోగులు దరఖాస్తులతో ఆర్టీసీ డిపోల వద్ద క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలను చూసి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమ్మెలో కొనసాగాలా లేక అధికారులను బ్రతిమాలుకొని మళ్ళీ విధులలో చేరాలో తెలియక అయోమయంలో ఉన్నారు.

సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కనుక ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ ఉద్యోగాలను నియమించుకొని పోలీసుల సహాయంతో బస్సులను నడిపిస్తున్నారు.  

ఆర్టీసీ సమ్మెను నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో కూడా ఒక పిటిషన్‌ దాఖలైంది. దానిపై ఈనెల 10న హైకోర్టు విచారణ చేపట్టనుంది. 

ఆర్టీసీ సమ్మెకు రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా మద్దతు తెలిపాయి.


Related Post