హుజూర్‌నగర్‌ టికెట్ కోసం తెరాసలో కూడా పోటీ?

September 20, 2019


img

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలలో టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి వర్గాలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తమ్ కుమార్ రెడ్డి తను ఖాళీ చేసిన హుజూర్‌నగర్‌ స్థానాన్ని తన భార్య పద్మావతీ రెడ్డికి ఇవ్వాలనుకొంటుండగా, ఎంపీ రేవంత్‌ రెడ్డి తన అనుచరుడు చామల కిరణ్ రెడ్డికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీలో ఆ ఇరువర్గాల మద్య హుజూర్‌నగర్‌ టికెట్ కోసం ప్రస్తుతం కీచులాటలు జరుగుతున్నాయి. 

ఇంతవరకు తెరాస హుజూర్‌నగర్‌ అభ్యర్ధిపేరు ప్రకటించనప్పటికీ ఆ పార్టీలో కూడా టికెట్ కోసం పోటీ మొదలైంది. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఈసారి హుజూర్‌నగర్‌ టికెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్‌నగర్‌ టికెట్‌ను సైదిరెడ్డికి ఇచ్చినప్పుడు తాను సిఎం కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడి సైదిరెడ్డి విజయానికి కృషి చేశానని అన్నారు. కనుక ఇప్పుడు హుజూర్‌నగర్‌ టికెట్ తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. తనకు టికెట్ కేటాయించినట్లయితే డిల్లీ వెళ్ళి సోనియా గాంధీ, అమిత్ షాలను కలిసి తన కుమారుడి త్యాగం గురించి వారికి తెలియజేసి, ఎన్నికలు ఏకపక్షంగా జరిగేందుకు సహకరించవలసిందిగా కోరుతానని అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తనకు ఈసారి టికెట్ కేటాయించినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తానని శంకరమ్మ చెపుతున్నారు. ఒకవేళ తెరాస మాజీ ఎంపీ కవితకు హుజూర్‌నగర్‌ టికెట్ కేటాయిస్తే తాను పోటీ నుంచి విరమించుకొని ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తానని శంకరమ్మ తెలిపారు. మరి ఈసారి సిఎం కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ టికెట్ ఎవరికిస్తారో చూడాలి.


Related Post