తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

September 18, 2019


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మంగళవారం రాత్రి నుంచి చాలా భారీగా వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్‌ నాగారంతో సహా రెండు రాష్ట్రాలలో పలు జిల్లాలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కర్నూలు జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ భారీగా నీరు చేరడంతో ఆలయంలోకి నీరు ప్రవేశించింది. గర్భాలయంలోని మహానందీశ్వరుడి విగ్రహం సైతం నీట మునిగింది. రుద్రగుండంలోని పంచలింగాల మండపంలో గల 5 శివలింగాలు నీట మునిగాయి. ప్రస్తుతం ఆలయంలో నీరు చేరడంతో నిత్యపూజలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల పట్టణంలో పలు ప్రాంతాలు నీట మునిగాయి.

 

ఇక హైదరాబాద్‌తో తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాలలో కనీవినీ ఎరుగని స్థాయిలో భారీవర్షాలు కురుస్తుండటంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. నల్గొండలో అత్యధికంగా 20. 08 సెంటీమీటర్లు వర్షం పడింది. జిల్లాలోని ఇబ్రహీంపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు పట్టణాలలో 13.25 సెంటీమీటర్లు వర్షపాతం నమోదు అయ్యింది. తుర్కపల్లిలో 12.43, ముల్కలపల్లిలో 11.20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. నల్గొండ జిల్లాలో గత వంద సంవత్సరాలలో ఈ స్థాయిలో వర్షం పడటం ఇదే మొదటిసారి. 

ఇక రాజధాని హైదరాబాద్‌ నగరంలో సాధారణ వర్షం కురిస్తేనే రోడ్లు నీట మునుగుతుంటాయి. నిన్న రాత్రి సుమారు 2 గంటలపాటు కురిసిన భారీ వర్షంతో నగరంలో కోఠి, మోహిదీపట్నం, ఆరాంఘర్ చౌరస్తా, ఎల్బీనగర్, చింతలకుంట, బేగంపేట, రామాంతపూర్, ఉప్పల్ తదితర ప్రాంతాలలో రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. కానీ నగరప్రజలందరూ ఇళ్లకు చేరుకున్న తరువాత రాత్రి 11 గంటల నుంచి వర్షం మొదలవడంతో దానిలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగారు. బుదవారం కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షం పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటం మంచిది.


Related Post