తెలంగాణకు పరిశ్రమలు క్యూకడుతున్నాయి: కేటీఆర్‌

September 14, 2019


img

మళ్ళీ రెండవసారి పరిశ్రమలశాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్‌ పరిశ్రమలు, టెక్స్‌టైల్స్‌, టిఎస్ఐఐసి, ఐ‌టి ఉన్నతాధికారులతో రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఇప్పటికే రాష్ట్రంలో ఫార్మాసిటీ, కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు, అప్పేరల్ పార్క్, నీమ్జ్, ఐ‌టి పార్కులు వివిదదశలలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న టిఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం సత్ఫలితాలు ఇస్తోంది. గత 5 ఏళ్ళలో అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చి హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో పలుజిల్లాలలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, ఐ‌టి, వ్యాపాసంస్థలు ప్రారంభిస్తున్నాయి. ఇంకా అనేకం సిద్దంగా ఉన్నాయి. త్వరలోనే ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్, ఏరో స్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు రాబోతున్నాయి.

రాష్ట్రంలో వ్యాపారసంస్థలు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులున్నాయి కనుకనే ఇంతవేగంగా ఈ రంగంలో ప్రగతి సాధించగలిగాము. ప్రస్తుతం పారిశ్రామిక అభివృద్ధి సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ, ఇక ముందుకూడా ఇదేవేగంతో ముందుకు సాగవలసిన అవసరం ఉంది. కనుక అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ తగిన ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు సాగాలి. పరిశ్రమలు, ఐ‌టి రంగం సమాంతరంగా అభివృద్ధి చెందుతునట్లయితే, ఉద్యోగ ఉపాది అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి,” అని అన్నారు.


Related Post