కే.కేశవరావుకు కేంద్రంలో కీలకపదవి

September 14, 2019


img

తెరాస రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావుకు కేంద్రంలో కీలకపదవి లభించింది. లోక్‌సభ స్పీకర్ ఆదేశాల మేరకు వివిద స్టాండింగ్ కమిటీల జాబితాను లోక్‌సభ సెక్రెటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ శనివారం ఉదయం ప్రకటించారు. తెరాస రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావును జాతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులైనట్లు ప్రకటించారు. దీనిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తదితరులు సభ్యులుగా ఉంటారు. కే.కేశవరావుకు స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులవడంతో తెరాసలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

అక్రమాస్తుల కేసులలో అవినీతి ఆరోపణలలో ప్రతీవారం నాంపల్లి కోర్టుకు హాజరవుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి అత్యంత ప్రధానమైన వాణిజ్యశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమింపబడటం విశేషం. ఆ కమిటీలో తెరాస ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు, టిడిపి ఎంపీ కేశినేని నాని, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సభ్యులుగా ఉంటారు. 

అలాగే 2జి కుంభకోణం కేసులో ఆరు నెలలు తిహార్ జైలులో గడిపివచ్చిన డిఎంకె ఎంపీ కనిమొళిని కెమికల్ ఫెర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులవడం విశేషం.  

భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.  

ఇటీవల టిడిపి నుంచి బిజెపిలో చేరిన టిజి వెంకటేష్‌ రవాణా, పర్యాటక, సాంస్కృతిక శాఖల స్థాయి సంఘం చైర్మన్‌గా నియమితులయ్యారు.

ఇక పార్లమెంటు ఆర్ధికశాఖ స్టాండింగ్ కమిటీలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఇటీవల బిజెపిలో చేరిన టిడిపి ఎంపీ సిఎం రమేష్‌ సభ్యులుగా నియమితులయ్యారు. 

రాష్ట్రంలో తెరాస సర్కార్‌పై బిజెపి నేతలు పోరాటం చేస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం తెరాసకు చెందిన కే.కేశవరావు, నామా నాగేశ్వర రావులకు కీలకపదవులు కట్టబెట్టడం ఆసక్తికరంగానే ఉంది. అయితే స్టాండింగ్ కమిటీలలో ఒక్క తెరాసకే కాక కాంగ్రెస్ పార్టీతో సహా వివిద పార్టీలలో సీనియర్ ఎంపీలకు కూడా కీలక పదవులు లభించినందున ఈ నియామకాలను రాజకీయకోణంలో చూడలేము. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటునవారికి, జైలుకు వెళ్ళి వచ్చిన వారికీ ఇటువంటి కీలకపదవులు కట్టబెట్టడమే విస్మయం కలిగిస్తుంది. ఈ నియామకాలు వారి కేసులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.  

స్టాండింగ్ కమిటీలు: ఛైర్మన్‌లు 

• జాతీయ పరిశ్రమల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కే కేశవరావు

• వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ విజయసాయిరెడ్డి 

• రవాణా టూరిజం సాంస్కృతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ టీజీ వెంకటేష్

• కెమికల్ ఫర్టిలైజర్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ కనిమొళి

• ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శశిథరూర్

• హోంశాఖ వ్యవహారాల పార్లమెంటరీ  స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ శర్మ 

• ఆర్థిక స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయంత్ సిన్హా

• పట్టణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జగదాంబికా పాల్

• విదేశాంగశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ పీపీ. చౌదరి 

• మానవ వనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సత్యనారాయణ

• శాస్త్ర సాంకేతిక వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జయరామ్ రమేష్ 

• ఆరోగ్య కుటుంబ  సంక్షేమ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ రామ్ గోపాల్ యాదవ్

• సిబ్బంది వ్యవహారాలు న్యాయశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా భూపేంద్ర యాదవ్

• వ్యవసాయ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జి. గౌడర్

• రక్షణశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ జువల్ ఓరం 

• విద్యుత్ శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాజీవ్ రంజన్ సింగ్

• రైల్వేశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాధామోహన్ సింగ్

• పెట్రోలియం నేచురల్ గ్యాస్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రమేష్ బి దూరి 

• సామాజిక న్యాయ శాఖ స్టాండింగ్ కమిటీఛైర్మన్ రమాదేవి

• కార్మిక శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ భర్తృహరి మెహతాబ్

• జలవనరుల శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సంజయ్ జైస్వాల్

• బొగ్గు ఉక్కు శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ రాకేష్ సింగ్

• ఆహార వినియోగ దారుల వ్యవహారాలశాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సుదీప్ బందోపాధ్యాయ 

• గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ జాదవ్. 


Related Post