హైదరాబాద్‌లో సైబర్ వాలంటీర్లు...భేష్!

September 13, 2019


img

అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాలను సుఖమయం చేస్తున్నట్లే అనేక దుష్పరిమాణాలకు కూడా కారణం అవుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్లు... వాటిలో శక్తివంతమైన కెమెరాలు వచ్చాక అవి యువతుల పాలిట శాపంగా మారుతున్నాయి. అలాగే ఇంటర్నెట్, వైఫీలు సామాన్యప్రజలకు అందుబాటులోకి రావడంతో ఆన్‌లైన్‌ లావాదేవీలు వాటితోపాటు సైబర్ నేరాలు కూడా పెరిగాయి. 

ఇటువంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు రాష్ట్రంలో సైబర్ పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ప్రజలలో.. ముఖ్యంగా యువతీయువకులలో వాటిపట్ల సరైన అవగాహన లేకపోవడంతో నానాటికీ సైబర్ నేరాలు పెరిగిపోతూనే ఉన్నాయి. 

ఈ సమస్య తీవ్రతను గుర్తించిన హైదరాబాద్‌లోని ఐ‌టి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకువచ్చి ముగ్గురు నలుగురు కలిసి ఒక బృందంగా ఏర్పడి, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అధ్వర్యంలో నగరంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలలో విద్యార్ధులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో కంటే రాష్ట్రంలోని చిన్న పట్టణాలు, గ్రామాలలో యువత, ప్రజలు ఈ సైబర్ నేరాలకు ఎక్కువగా బలవుతుంటారు కనుక  ఇటువంటి కార్యక్రమాలను రాష్ట్రమంతటా చేపట్టవలసిన అవసరం ఉంది. 

అలాగే విద్య ఉద్యోగావకాశాలు, విదేశీ విద్యఉద్యోగావకాశాలు, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాది అవకాశాలు, మానసిక వికాసం, శారీరిక పరిశుభ్రత ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యత వంటి వివిద అంశాలపై పట్టున్నవారు లేదా ఆయా రంగాలలో పనిచేస్తున్నవారు స్వచ్ఛందంగా ముందుకువచ్చి యువతకు,  ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపడితే సమాజంలో తప్పకుండా మంచి మార్పులు మొదలవుతాయి.


Related Post