గమనిక నేను పార్టీ మారడం లేదు: తెరాస ఎమ్మెల్యే

September 13, 2019


img

తెరాస భోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గురువారం నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌తో భేటీ అయిన తరువాత బిజెపిలో చేరాలనుకొంటున్నట్లు చెప్పారు. కానీ నిన్న రాత్రి తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు ప్రగతి భవన్‌ వెళ్ళి ఆయనతో సమావేశం అయిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “నేను బిజెపిలో చేరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. కేంద్రప్రభుత్వం నిధులతో భోధన్‌లో అమలుచేయబోతున్న రూరల్ అర్బన్ పధకం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికే నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటికి వెళ్ళి కలిశాను తప్ప బిజెపిలో చేరాలనే ఉద్దేశ్యంతో కాదు. ఆ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయా గురించి చర్చించిన మాట వాస్తవం. కానీ అంతమాత్రన్న నేను పార్టీ మారుతానని చెప్పడం సరికాదు. నేను జీవించి ఉన్నంతకాలం తెరాసలోనే ఉంటాను. సిఎం కేసీఆరే నా పోలిటికల్ గాడ్ ఫాదర్. మంత్రి పదవి కావాలని నేను అడుగలేదు. కనుక లభించలేదనే బాధ లేదు. కానీ భవిష్యత్‌లో ఏదో ఓ రోజు నాకు తప్పకుండా సముచిత స్థానం లభిస్తుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్రహోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. అదే రోజున రాష్ట్రంలో ‘రాజకీయ విలీన దినోత్సవం’ జరుగబోతోందని రాష్ట్ర బిజెపి నేతలు చెప్పుకొంటున్నారు. తెరాస ఎమ్మెల్యేలను, నేతలను బిజెపిలోకి రప్పించేందుకు ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ ఎన్నడూ లభించదు కనుక మంత్రిపదవులు లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వారిని బిజెపిలోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తునట్లు తెలుస్తోంది. కనుక ఈనెల 17న ఎవరెవరు బిజెపిలో చేరబోతున్నారనే దానిపై పూర్తి స్పష్టత రావచ్చు.


Related Post