అసంతృప్తి లేదు..గండ్ర

September 11, 2019


img

మంత్రివర్గ విస్తరణతో తెరాసలో అసంతృప్తి జ్వాలలు రగులుకున్నాయి. పార్టీలో ఓనర్లు...కిరాయిదార్లనే కొత్త పదాలు పుట్టుకొచ్చాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న ఓనర్లు అలకపాన్పు ఎక్కుతుంటే...పరిస్థితి తీవ్రతను గమనించి కిరాయిదారులు సర్దుకుపోకతప్పడం లేదు. పార్టీలో కిరాయిదారులకు గ్రీన్ కార్డు లభించి ఓనర్లుగా మారేవరకు ఈ తిప్పలు తప్పవు. 

తెరాస నిజామాబాద్‌ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, అసెంబ్లీ ఎన్నికలలో భూపాలపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గెలిచి తెరాసలో చేరిన గండ్ర వెంకటరమణ ఇద్దరూ కూడా మంత్రిపదవులు ఆశించినవారిలో ఉన్నారు. కానీ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. దాంతో వారిరువురూ విలేఖరులతో సమావేశం నిర్వహించి ఆ వార్తలను ఖండించారు. తాము సిఎం కేసీఆర్‌ నాయకత్వం పట్ల ఆకర్షితులమై చేరామే తప్ప పదవుల కోసం తెరాసలో చేరలేదని చెప్పారు. కనుక తమకు మంత్రిపదవులు రానందుకు ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పారు. తమ పట్ల సోషల్ మీడియాలో ఇటువంటి దుష్ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు.


Related Post