టి-కాంగ్రెస్‌కు మరో అగ్నిపరీక్ష!

September 10, 2019


img

ఫిరాయింపులతో డీలాపడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో అగ్నిపరీక్ష ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆ పరీక్ష గురించి ప్రకటించారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియాతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, “మా అధిష్టానం ఆదేశానుసారం ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాము. ముందుగా మహబూబ్‌నగర్‌ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తాము. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలతో విసుగెత్తిపోయున్నా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో బిజెపికి ఏమాత్రం ప్రజాధారణ, బలం లేకపోయినప్పటికీ ఆ పార్టీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకొని 2023 అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను ఓడించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తాము,” అని అన్నారు. 

ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటమే కాక ప్రజలలో విశ్వసనీయతను కూడా కోల్పోయింది. ఒక పార్టీ బలహీనపడితే మళ్ళీ ఏదోవిధంగా కోలుకొని అధికారంలోకి రావచ్చు. కానీ విశ్వసనీయత కోల్పోతే మాత్రం చాలా కష్టం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వరుసగా తెరాసలో చేరిపోవడంతో, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా వారు తెరాసలో చేరిపోతారనే బలమైన అభిప్రాయం ప్రజలలో ఏర్పడింది. ఆ కారణంగా కాంగ్రెస్‌ విశ్వసనీయత దెబ్బ తింది. పైగా అనేకమంది కాంగ్రెస్‌ నేతలు పార్టీని వీడివెళ్ళిపోయారు కనుక వారి నియోజకవర్గాలలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం చాలా కష్టమే. కనుక ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షవంటిదేనని భావించవచ్చు. ఈ పరీక్షలో కాంగ్రెస్‌ ఏమేరకు విజయం సాధిస్తుందో త్వరలోనే తెలుస్తుంది. 



Related Post