కోమటిరెడ్డి పాదయాత్రకు పోలీస్ బ్రేక్

August 26, 2019


img

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తిచేయాలని కోరుతూ అక్కడి నుంచి హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేయాలనుకున్నారు. పాదయాత్రకు అనుమతి, రక్షణ కోరుతూ డిజిపి మహేందర్ రెడ్డికి, జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ పాదయాత్ర సాగే జాతీయరహదారి నిత్యం రద్దీగా ఉంటుందని, పైగా గణేశ్ నవరాత్రి సందర్భంగా రాష్ట్రంలో పోలీసులు అందరూ బందోబస్తులో తీరికలేకుండా ఉంటారని కనుక అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ రంగనాథ్‌ బదులిచ్చారు.    

దీనిపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందిస్తూ, “రాష్ట్ర ప్రభుత్వం ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించివేస్తూ చాలా నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వీలులేకుండా పోయింది. ఫ్లోరైడ్ పీడిత నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై వేలకోట్లు ఖర్చు చేస్తోంది. నల్గొండ జిల్లాపై సిఎం కేసీఆర్‌ ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో నాకు అర్ధం కావడం లేదు.  పోలీసుల నిర్ణయాన్ని నేను కోర్టులో సవాలుచేస్తాను. కోర్టు అనుమతితో తప్పకుండా పాదయాత్ర చేస్తాను,” అని అన్నారు.


Related Post