నిజామాబాద్‌లో పాకిస్థాన్‌ జిందాబాద్!!!

August 26, 2019


img

నిజామాబాద్‌ జిల్లా గుండారం మండల కేంద్రం కూడలిలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మసిపూసి, విగ్రహం మెడలో ‘పాకిస్తాన్ జిందాబాద్...ఇండియా డౌన్ డౌన్.. కశ్మీర్‌ పాకిస్థాన్‌దే. షాదుల్లాను విడుదల చేయాలి,” అంటూ ఇంగ్లీషులో నినాదాలు వ్రాసిన కాగితాలను వ్రేలాడదీశారు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.  

గతవారమే పోలీసులు నిషేదిత సిమీకి చెందిన షాదుల్లాతో పాటు మరో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. అతనిని విడుదల చేయాలని ఆ కాగితాలలో వ్రాసి ఉండటంతో ఇది వారి పనే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిజామాబాద్‌ నగరంతో పాటు కామారెడ్డి, బోధన్, నందిపేట, రెంజల్ తదితర ప్రాంతాలలో ఉగ్రవాదుల సానుభూతిపరులున్నట్లు పోలీసులు గుర్తించారు. 

గత కొంతకాలంగా ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు వ్యక్తులు నిజామాబాద్‌ వచ్చి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారు స్థానిక యువతను రెచ్చగొడుతూ జిల్లాలో మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కనుక పెడమార్గం పడుతున్న ఆ యువతను హెచ్చరించి, వారి తల్లితండ్రులకు కూడా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ నిన్న జరిగిన ఈ సంఘటనతో చాప కింద నీరులా ఉగ్రవాదుల సానుభూతిపరులు పనిచేస్తూనే ఉన్నారని స్పష్టమయింది.


Related Post