మన బంగారు సింధు.. విశ్వవిజేత

August 26, 2019


img

మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో బంగారు పతకం గెలుచుకొని విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం స్విట్జర్‌ల్యాండ్‌లో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరను 21-7,21-7 పాయింట్లతో ఓడించి  తొలిసారిగా భారత్‌కు బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించిపెట్టింది. విశేషమేమిటంటే రెండేళ్ళ క్రితం ఎవరి చేతిలో ఓడిపోయి రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చిందో ఇప్పుడు ఆమెనే ఓడించి బంగారు పతకం సాధించింది. ఆట మొదలైనప్పటి నుంచి సింధూ చాలా దూకుడుగా ఆడుతూ నోజోమి ఒకుహరపై పైచెయ్యి సాధించి 38 నిమిషాలలో ఆట ముగించింది.      

2013,14 పోటీలలో కాంస్యం, 2017లో రజత పతకం సాధించిన సింధుకు యావత్ భారతీయులు జేజేలు పలికారు. కానీ అదే సమయంలో ఆమె స్వర్ణం సాధించలేక తడబడుతుంటుందనే తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ విమర్శలకు సింధు నిన్న స్వర్ణంతో సమాధానం చెప్పింది. తన తల్లి పుట్టినరోజునాడు సాధించిన ఈ విజయాన్ని ఆమెకే అంకితం చేస్తున్నానని సింధు చెప్పింది. 

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిద రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వర్ణం సాధించినందుకు ఆమెను అభినందించారు. 


Related Post