మా తదుపరి లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి: కేసీఆర్‌

August 24, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తిచేయించిన సిఎం కేసీఆర్‌, ఇక నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై దృష్టి పెట్టబోతున్నారు. ప్రగతి భవన్‌లో శుక్రవారం సాగునీటిశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో నాగర్ కర్నూల్, నారాయణ్ పేట, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలోని 70 మండలాలో 12.3 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కానీ వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ (జూన్) నాటికి ఈ ప్రాజెక్టు పనులను కొంతవరకు పూర్తిచేసి కనీసం 7 లక్షల ఎకరాలకు నీరు అందించాలనే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్లుగా ఈపాటి నుంచే కాల్వలు, పంప్‌హౌస్‌, టన్నెల్ నిర్మాణపనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజనుకు ఈ ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేసేందుకు వీలుగా పనులు చేపట్టాలని సిఎం కేసీఆర్‌ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరిగానే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా అవసరమైన నిధులను అందుబాటులో ఉంచుతామని సిఎం కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం పీఎఫ్‌సీ ద్వారా రూ.10,000 కోట్లు రుణాల సేకరణకు ప్రక్రియ మొదలుపెట్టాలని సూచించారు. త్వరలోనే తాను ప్రాజెక్టు సందర్శనకు వస్తానని సిఎం కేసీఆర్‌ తెలిపారు.


Related Post