బొత్సకు సిబిఐ సమన్లు!

August 23, 2019


img

ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించిన బొత్స సత్యనారాయణకు నాంపల్లిలోని సిబిఐ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో జర్మనీకి చెందిన ఫోల్క్స్ వేగన్ కార్ల కంపెనీని ఏర్పాటు చేస్తామంటూ వశిష్ట్ వాహన్ అనే సంస్థకు చెందిన కొందరు ప్రముఖులు ప్రతిపాదించగా ఆయన సానుకూలంగా స్పందించారు.

ఆ తరువాత వశిష్ట్ వాహన్‌ ప్రతినిధులతో కలిసి కొందరు అధికారులను వెంటబెట్టుకొని చర్చల కోసం జర్మనీ వెళ్ళారు. ప్రభుత్వంతో ఏవిధంగానూ సంబందం లేని తన సోదరుడిని కూడా ఆయన జర్మనీ వెంటబెట్టుకు వెళ్ళడంపై ఆనాడు పెద్ద దుమారమే చెలరేగింది. చర్చల అనంతరం వశిష్ట్ వాహన్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.11 కోట్లు అడ్వాన్స్ గా విడుదల చేసింది. కానీ ఆ తరువాత వశిష్ట్ వాహన్ చేతులు ఎత్తేయడంతో ప్రభుత్వం రూ.11 కోట్లు నష్టపోయింది.

కార్ల కంపెనీ ఏర్పాటు పేరిట ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు 2010లో సిబిఐ నాంపల్లి కోర్టులో కేసు వేసింది. ఆ తరువాత నేటి వరకు ఆ కేసు విచారణ ప్రస్తావన ఎక్కడా వినబడలేదు. 9 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు ఆ కేసులో ఎందుకో కదలిక వచ్చింది. సెప్టెంబర్ 12న సిబిఐ కోర్టులో ఈ కేసుకు విచారణకు కావలసిందిగా సమన్లు పంపింది. ఈ కేసులో తనను సాక్షిగానే పిలిచింది తప్ప దానితో తనకు ఎటువంటి సంబందామూ లేదని బొత్స సత్యనారాయణ చెప్పారు.


Related Post