బతుకమ్మ చీరలకు ప్రత్యేక గుర్తింపు...మంచి ఆలోచనే

August 23, 2019


img

తెలంగాణ ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మ చీరల పంపిణీకి శ్రీకారం చుట్టిన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ దానికి మరింత ప్రాచుర్యం కల్పించడానికి బతుకమ్మ చీరలపై ఒక అందమైన ముద్ర (లోగో)ను ముద్రించాలని అధికారులకు సూచించారు. తద్వారా వాటికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుందని అన్నారు. బుదవారం సిరిసిల్ల జిలా కేంద్రంలో తన క్యాంప్ కార్యాలయంలో చేనేత, జౌళి శాఖ అధికారులతో సమావేశమైన కేటీఆర్‌, బతుకమ్మ చీరలను చూసి మెచ్చుకున్నారు. గతంలో కంటే చాలా అందంగా, నాణ్యంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.

ఈ పధకం ద్వారా జిల్లాలో చేనేత, మరమగ్గాల నేత కార్మికులకు జీవనోపాధి కల్పిస్తూనే, రాష్ట్రంలో పేద మహిళలకు ప్రతీ ఏడాది బతుకమ్మ పండుగకు రెండు చీరలు అందజేయడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని కేటీఆర్‌ అన్నారు. ఈ పధకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.320 కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. బతుకమ్మ చీరల తయారీ ద్వారా జిల్లాలో 23,614 మరమగ్గాలకు, 112 మ్యాక్, 163 ఎస్ఎస్ఐల ద్వారా 6.84 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి జరుగుతోందని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో కోటి మంది మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే నెల 15 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సంచలకురాలు శైలజారామయ్యర్‌ తెలిపారు. 

బతుకమ్మ చీరలకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలనుకోవడం చాలా మంచి ఆలోచనే. అయితే కేవలం బతుకమ్మ చీరలకే దానిని పరిమితం చేయకుండా సిరిసిల్లలో తయారవుతున్న అన్ని రకాల చీరలకు వర్తింపజేస్తే కంచి, ధర్మవరం, గద్వాల్ చీరల వలె సిరిసిల్ల చీరలకు కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ ఏర్పడుతుంది.


Related Post