ఆఫీసులో దొంగతనం అవుతాయని ఇంటికి పట్టుకుపోయా: కోడెల

August 23, 2019


img

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నివాసం ఉంటున్న ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. అయితే వారు ఇంట్లోని డబ్బు, వెండిబంగారు ఆభరణాల జోలికి వెళ్లలేదు. ఒక కంప్యూటర్‌ను మాత్రమే ఎత్తుకు వెళ్లారు. మళ్ళీ దానిలో మానిటర్‌ను అక్కడే పడేసి ఒక్క సిపియూను మాత్రమే పట్టుకుపోయారు!

దీని వెనుక ఒక చిన్న కధ ఉంది. హైదరాబాద్‌ అసెంబ్లీ నుంచి అమరావతిలో నిర్మించిన ఏపీ అసెంబ్లీకి ఫర్నీచర్, కంప్యూటర్లు వగైరా విలువైన వస్తువులను తరలించినప్పుడు, ఆ సమయంలో స్పీకరుగా వ్యవహరిస్తున్న కోడెల వాటినన్నిటినీ సత్తెనపల్లిలో తన ఇంటికి తరలించుకుపోయారు. దీనిపై జగన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో ఏపీ అసెంబ్లీ కార్యదర్శి కోడెల ఇంటికి తరలించుకుపోయిన వస్తువుల వివరాలను, వాటి విలువను తెలియజేయవలసిందిగా కోరుతూ ఒక లేఖ వ్రాశారు. దానికి కోడెల బదులిస్తూ, “అసెంబ్లీ హాలులో భద్రత లేదని భావించి వాటన్నిటినీ తన క్యాంప్ కార్యాలయంలో భద్రపరిచానని, కావాలనుకుంటే అధికారులు వాటిని తిరిగి తీసుకుపోవచ్చునని లేదా వాటికి విలువ కట్టినట్లయితే ఆ సొమ్మును చెల్లించడానికి సిద్దంగా ఉన్నానని” లేఖ వ్రాశారు. ఈరోజు ఉదయం వాటిని పరిశీలించడానికి కోడెల నివాసానికి వస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు తెలియజేశారు. కానీ వారు వచ్చే కొన్ని గంటల ముందే ఆ వస్తువుల వివరాలన్నీ భద్రపరిచినట్లు చెప్పబడుతున్న కంప్యూటరును దొంగలు ఎత్తుకుపోవడం విశేషం.

అధికారంలో నుంచి దిగిపోతున్నవారు కొత్తగా బాధ్యత తీసుకొన్నవారికి తాము అంతవరకు ఉపయోగించుకున్న ఫర్నీచర్, కంప్యూటర్స్, ఏసీలు ఇతర వస్తువుల వివరాలను అందజేసి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ తీసుకోవలసి ఉంటుంది. కానీ కోడెల అవన్నీ తన సొంత వస్తువులే అన్నట్లు ఇంటికి తరలించుకుపోయారు. విషయం బయటపడగానే ప్రభుత్వ భవనంలో వాటికి భద్రత లేదు కనుక తన ఇంటికి తెచ్చి భద్రపరిచానని చెపుతున్నారు. కానీ నిన్న రాత్రి ఆ రికార్డులు ఉన్న కంప్యూటర్ దొంగతనం అవడం అనుమానాలు కలుగజేస్తోంది. కోడెలపై ఏపీ ప్రభుత్వం కటిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.


Related Post