గవర్నర్‌, సిఎం, డిజిపిలకు పార్సిల్స్!

August 21, 2019


img

సికింద్రాబాద్‌లోని ప్రధాన పోస్ట్ఆఫీసుకు సోమవారం ఉదయం కొన్ని అట్టపెట్టెలు వచ్చాయి. వాటిని చూసి పోస్టల్ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. కారణం... ఆ అట్టపెట్టెలపై గవర్నర్‌ నరసింహన్‌, సిఎం కేసీఆర్‌, డిజిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్‌ సిటీ కమీషనర్ వి అంజనీకుమార్, డిసిపిలు, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత తదితరుల పేర్లు వ్రాసుండటమే. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆ అట్టపెట్టెలను తెరిచి చూడగా వాటిలో నీళ్ళ సీసాలున్నాయి. కానీ అవి నీళ్ళలా కాక ఏదో రసాయనంలా కనిపిస్తుండటం, పైగా వాటిలో నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో పోలీసులు క్లూస్ టీంను రప్పించారు. అవి నగరంలోని పరిశ్రమల నుంచి వెలువడిన రసాయన వ్యర్ధాలని క్లూస్ టీం గుర్తించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పెట్టెలలో ప్రముఖులను ఉద్దేశ్యించి వ్రాసిన లేఖలు కూడా ఉన్నాయి. కాలుష్య సమస్య గురించి వాటిలో వ్రాసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

అయినప్పటికీ వివిఐపిలకు ఇటువంటి పదార్ధాలను పోస్టులో పంపించడం నేరం కనుక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అవి ఉస్మానియా యూనివర్సిటీలోని పోస్టాఫీస్ నుంచి ప్రముఖుల పేరిట బుక్‌ చేయబడ్డాయని గుర్తించిన పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడి పోస్టల్ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. 

నానాటికీ నగరంలో పరిశ్రమల వ్యర్ధాల వలన నీటి కాలుష్యం పెరిగిపోతున్నప్పటికీ కాలుష్య నివారణమండలి పట్టించుకోకపోవడంతో ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకే ఉస్మానియా విద్యార్దులు ఎవరో ఈపని చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


Related Post