సిఎం కేసీఆర్‌ నేడు గజ్వేల్ పర్యటన

August 21, 2019


img

సిఎం కేసీఆర్‌ నేడు తన నియోజకవర్గం గజ్వేల్‌లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, 33 జిల్లాల కలెక్టర్లు కూడా గజ్వేల్‌లో పర్యటించనున్నారు. గజ్వేల్‌ మండలంలోని కోమటిబండగుట్టపై మిషన్ భగీరధలో భాగంగా  నిర్మించిన గ్రౌండ్ లెవెల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద కొత్తగా నిర్మించిన నాలెడ్జ్ సెంటర్ భవనంలో వారు ఈరోజు సమావేశం కానున్నారు. గజ్వేల్‌లో చేపట్టిన మిషన్ భగీరధ, హరితహారం పనులు ఏవిధంగా సాగుతున్నాయో వారందరికీ వివరించి వాటిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో 33 జిల్లాలో కూడా అదేవిధంగా పనులు జరిపించాలని చెప్పడానికే సిఎం కేసీఆర్‌ వారిని అక్కడకు తీసుకువెళుతున్నారు. 

సిఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు అందరూ కలిసి ఒకేసారి పర్యటనకు వస్తునందున జిల్లా అధికారులు, పోలీస్ శాఖ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. 

కోమటిబండ వద్ద నిర్మించిన మిషన్ భగీరధ పంప్‌హౌస్‌కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలోకెల్లా అతిపెద్ద పంప్‌హౌస్‌ ఇదే. దీని సామర్ధ్యం కోటి 40 లక్షల లీటర్లు. ఈ ప్రాజెక్టు సమీపంలోనే శాశ్వితప్రాతిపదికన ఒక హెలీప్యాడ్ కూడా నిర్మించారు. కనుక ముఖ్యమంత్రి, ప్రముఖులు లేదా ఉన్నతాధికారులు హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు నేరుగా ఇక్కడకు హెలికాఫ్టర్‌లో చేరుకోవచ్చు. 5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో పంప్‌హౌస్‌ సమీపంలోనే ఒక నాలెడ్జ్ సెంటర్ భవనాన్ని కూడా నిర్మించారు. దానిని సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రారంభించనున్నారు. సిఎం కేసీఆర్‌, అధికారులు సమీక్షా సమావేశాలు జరుపుకోవడానికి వీలుగా దానిని అన్ని సౌకర్యాలతో నిర్మించారు. దానిలోనే నేడు సిఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లు, మంత్రులతో తొలి సమావేశం నిర్వహించనున్నారు. 


Related Post