కెప్టెన్ ముందే దూకేశారు: బిజెపి

August 20, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి మళ్ళీ సోనియా గాంధీకె పార్టీ పగ్గాలు అప్పగించడం వరకు సాగిన నాటకీయ పరిణామాలపై బిజెపి జాతీయ కార్యదర్శి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. “ఓడ మునిగిపోతుంటే దానిలో ప్రయాణికులను కాపాడేందుకు కెప్టెన్ తన ప్రాణాలు పణంగా పెట్టి చివరి వరకు ప్రయత్నిస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అనే ఓడ మునిగిపోతుంటే దాని కెప్టెన్ రాహుల్ గాంధీ ముందే బయటకు దూకేశారు. ఆ తరువాత రెండు నెలల డ్రామా తరువాత అధ్యక్ష పదవి మళ్ళీ సోనియా గాంధీకే కట్టబెట్టారు. ఆ పదవి ఆమెకు కట్టబెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ ఇంత కధ నడిపించినట్లుంది. ఇదెలా ఉందంటే అహ్మద్ టోపీని మహ్మద్ నెత్తిన, మహ్మద్ టోపీని అహ్మద్ నెత్తిన పెట్టినట్లు ఉంది,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకొంటుందని యావత్ దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఒక రోజంతా సుదీర్గ చర్చలు, సమావేశాలు నిర్వహించిన తరువాత సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సోనియా, ప్రియాంకా ఇద్దరూ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని  చేపట్టబోమని పదేపదే చెపుతున్నా సోనియాకే పార్టీ పగ్గాలు అప్పగించడం కాంగ్రెస్ బలహీనతకు అద్ధం పడుతోంది. 


Related Post