అది కర్ణాటక...ఇది తెలంగాణ: కేటీఆర్‌

August 19, 2019


img

బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన బహిరంగసభలో తెరాస సర్కార్‌ అవినీతి, కేసీఆర్‌ కుటుంబ పాలనపై చేసిన విమర్శలపై తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చాలా ఘాటుగా స్పందించారు. సోమవారం కూకట్‌పల్లిలో జరిగిన తెరాస నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కర్ణాటక, ఇతర రాష్ట్రాలలో రాజకీయాలు చేసినట్లు తెలంగాణలో సాధ్యం కాదనే సంగతి బిజెపి నేతలు గ్రహిస్తే మంచిది. తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మీ, ఆసరా పింఛన్లు, రైతు బందు వంటి అనేకానేక పధకాలను   అమలుచేస్తున్నాము. రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నాము. కేంద్రప్రభుత్వం పైసా ఇవ్వకపోయినా ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, భగీరధ వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము. బిజెపి పాలిత రాష్ట్రాలలో నేటికీ అనేక గ్రామాలలో త్రాగునీరు, కరెంటు, రోడ్లు, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పించలేకపోతోంది.

కేంద్రప్రభుత్వంతో సహా బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తున్నాయి. మరి అటువంటప్పుడు రాష్ట్రంలో అవినీతి జరిగిపోతోందని బిజెపి నేతలు వాదించడం హాస్యపదంగా ఉంది.. తెరాసకు రాష్ట్రంలో 50 లక్షలమంది సభ్యులున్నారంటే పార్టీకి ఎంతటి ప్రజాధారణ ఉందో అర్ధమవుతుంది కానీ బిజెపి నేతలు అది గ్రహించకుండా మా ప్రభుత్వంపై బురద జల్లి ప్రజలను ఆకట్టుకుందామనే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి మానుకుంటే వారికే మంచిది లేకుంటే ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు. ఇది కర్ణాటక కాదు తెలంగాణ అని బిజెపి నేతలు గుర్తుంచుకోవాలి,” అని అన్నారు.


Related Post