తెరాస సర్కార్‌పై జెపి నడ్డా విమర్శలు

August 19, 2019


img

రాష్ట్ర బిజెపి అధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో ‘నమో భారత్-నవ తెలంగాణ’ పేరిట జరిగిన బహిరంగసభలో పాల్గొన్న బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా ఊహించినట్లుగానే తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్  పధకాన్ని రాష్ట్రంలో అమలుచేస్తే ఆ క్రెడిట్ ప్రధాని నరేంద్రమోడీకి దక్కుతుందనే భయంతోనే రాష్ట్రంలో దానిని అమలుచేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి తెరాస సర్కార్‌ వేలకోట్లు అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగపడవలసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పధకాలు తెరాస పెద్దల జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతున్నాయని విమర్శించారు.

ప్రధానమంత్రి ఆవాస్ పధకం క్రింద కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు మంజూరు చేస్తునప్పటికీ ఇంతవరకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోతోందని ప్రశ్నించారు. అలాగే హరితహారం కోసం నిధులు తీసుకొని లెక్కలు చూపడం లేదని ఆరోపించారు. సిఎం కేసీఆర్‌కు దళితులు, మహిళల పట్ల చులకన భావం ఉంది కనుకనే తన మంత్రి వర్గంలో వారికి చోటు కల్పించలేదని జెపి నడ్డా విమర్శించారు.

తెరాసతో సహా దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని, కాంగ్రెస్ పార్టీ కూడా వారసత్వ రాజకీయాలకు నిలయంగా మారిందని అన్నారు. కాంగ్రెస్‌ తల్లీ కొడుకుల పార్టీ అయితే తెరాస తండ్రీ కొడుకులపార్టీ అని నడ్డా ఎద్దేవా చేశారు. నేను, నా కుటుంబమే అన్నట్లు కేసీఆర్‌ కుటుంబపాలన సాగుతోందని నడ్డా అన్నారు. రాష్ట్రంలో అవినీతిరహితమైన, ప్రజారంజకమైన ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తి ఒక్క బిజెపికి మాత్రమే ఉందని జెపి నడ్డా అన్నారు. 


Related Post