యాదాద్రి పనులపై కేసీఆర్‌ అసంతృప్తి

August 17, 2019


img

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నందున అక్కడ సుదర్శనయాగం చేయాలని భావించిన సిఎం కేసీఆర్‌ అక్కడ నత్త నడకన సాగుతున్న నిర్మాణ పనులను చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం యాదాద్రి ఆలయ సందర్శనానికి వచ్చిన సిఎం కేసీఆర్‌, యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (యాడ) అధికారులతో హరిత హోటల్‌లో యాదాద్రి నిర్మాణపనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

నత్తనడకన పనులు జరుగుతున్నాయని సిఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేయగా, నిధుల విడుదల కాకపోవడం చేత పనులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు చెప్పారు. ఆలయ అభివృద్ధికి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని వారు సిఎం కేసీఆర్‌కు తెలిపారు. తాను హైదరాబాద్‌ తిరిగి వెళ్ళగానే ఆర్ధికశాఖ కార్యదర్శితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తానని ముందుగా ఆలయ నిర్మాణ పనుల కోసం రూ.50 కోట్లు తక్షణం విడుదల చేయాలని సిఎం కేసీఆర్‌ ఆర్ధిక శాఖను ఆదేశించారు.

త్వరలోనే యాడకు చీఫ్ ఇంజనీర్ స్థాయి అధికారిని నియమించబోతున్నట్లు తెలిపారు. యాదాద్రి నిర్మాణ పనులన్నీ ఫిబ్రవరిలోపు పూర్తిచేయాలని సిఎం కేసీఆర్‌ గడువు విధించారు. ఆలయ నిర్మాణపనులు పూర్తయిన తరువాతే ఫిబ్రవరిలో సుదర్శన యాగాన్ని నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించారు.


Related Post