త్వరలో పంట రుణాల మాఫీ తొలి వాయిదా చెల్లింపు?

August 17, 2019


img

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో మాట్లాడుతూ త్వరలో పంట రుణాల మాఫీ హామీని అమలుచేస్తామని ప్రకటించారు. నిధుల విడుదలకు ఆర్ధికశాఖ సిద్దంగా ఉన్నందునే సిఎం కేసీఆర్‌ ఆ ప్రకటన చేశారని తెలుస్తోంది. గత తెరాస ప్రభుత్వంలో మొత్తం రూ.17,000 కోట్లు రుణాలు మాఫీ చేయగా ఈసారి రూ.30,000 కోట్లు మాఫీ చేయబోతోంది. అయితే మొత్తం రుణం ఒకేసారి కాకుండా నాలుగు వాయిదాలలో మాఫీ చేయబోతోంది. రాష్ట్రంలో సుమారు 46 లక్షల మంది రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకోగా వారిలో లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్నవారు42 లక్షల మంది ఉన్నారు. వారికి త్వరలోనే రుణాల మాఫీకి మొదటి వాయిదా కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రంలో రైతులు సుమారు రూ.50,000 కోట్లు పంటరుణాలు తీసుకున్నారని కనుక మొదటి వాయిదాగా ప్రభుత్వం విడుదల చేయబోయే రూ.7-8,000 కోట్లతో రైతుల సమస్యలు తీరవని తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్ అన్నారు. కనీసం తొలి విడత నిధులను ఖరీఫ్ సీజన్ మొదలవక మునుపే విడుదల చేసి ఉన్నా రైతులకు ఎంతో కొంత ఉపయోగపడి ఉండేదని కానీ ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నందున రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించవలసి వస్తోందని సాగర్ అన్నారు. 


Related Post