రజనీకాంత్ పార్టీలో నేడు లేదు..ఎప్పుడూ రేపే!

August 17, 2019


img

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాపు దశాబ్ధకాలంగా రాజకీయాలలోకి వస్తానని చెపుతున్నారు. జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత నెలకొని ఉన్నప్పుడు ఆయన తప్పకుండా రాజకీయ ప్రవేశం చేస్తారని అందరూ అనుకున్నారు. అభిమానులతో ఫోటో షూట్ అంటూ హడావుడి చేయడంతో అది రాజకీయ ప్రవేశం కోసమేనని అందరూ భావించారు. కానీ రజనీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు. లోక్‌సభ ఎన్నికల రూపంలో మరో అవకాశం వచ్చినా రజనీ దానినీ ఉపయోగించుకోలేదు. ఎపుడు అడిగినా త్వరలో వస్తానని చెప్పడమే కానీ నిర్ధిష్టంగా ఎప్పుడు రాజకీయాలలోకి దిగుతారో చెప్పకపోవడంతో ‘రజనీకాంత్ పార్టీలో నేడు లేదు..ఎప్పుడూ రేపే’ అనే ఓ జోక్ వినిపిస్తుంటుంది.

అయితే ఆయన ఈసారి రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో రాజకీయ ప్రవేశం చేస్తారని ఆయన సహచరుడు ప్రముఖ కాంగ్రెస్‌ నేత కరాటే త్యాగరాజన్ చెప్పారు. ఈ ఏడాది డిసెంబరులోగా రజనీ తప్పకుండా ప్రజాక్షేత్రంలోకి వస్తారని త్యాగరాజన్ చెప్పారు. కనుక రజనీకాంత్ మరో 4 నెలలు సమయం తీసుకున్నట్లయింది. కానీ రజనీ తీరును బట్టి అప్పటికైనా రాజకీయ ప్రవేశం చేస్తారో లేదో అనుమానమే. సినిమాలలో చాలా వీరోచితంగా కనిపించే రజనీకాంత్ నిజజీవితంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం ఆశ్చర్యంగానే ఉంది. అయినా సినిమాలు, రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాల్సిన వయసులో ఇంకా ఇటువంటి ఆలోచనలు చేస్తుండటం కూడా ఆశ్చర్యకరమే.


Related Post