సిఎం కేసీఆర్‌కు ఉత్తమ్ లేఖ

August 17, 2019


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సిఎం కేసీఆర్‌కు శుక్రవారం ఒక బహిరంగలేఖ వ్రాశారు. మహబూబ్‌నగర్‌లోని అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను అనుమతించరాదని ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ ద్వారా సిఎం కేసీఆర్‌ను కోరారు. దట్టమైన ఆ అటవీప్రాంతంలో యురేనియం తవ్వకాల వలన అక్కడ నివశిస్తున్న చెంచుల జీవితాలు చిన్నాభిన్నమవుతాయని, పులులు తదితర అనేక వన్యప్రాణులు అంతరించిపోతాయని, పర్యావరణానికీ తీవ్రహాని కలుగుతుందని కనుక యురేనియం తవ్వకాలకు అనుమతించరాదని కోరారు. యురేనియం తవ్వకాలు మొదలుపెడితే జరిగే ప్రకృతి విధ్వంసం, జల, వాయు కాలుష్యాన్ని ఎవరూ అరికట్టలేని పరిస్థితులు ఏర్పడుతాయని హెచ్చరించారు. 

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాష్ట్రంలో అమ్రాబాద్, దేవరకొండ, మన్ననూర్, పదిర, నాగార్జునసాగర్ పరిధిలో గల లంబాపూర్‌లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. దానిని దృవీకరించుకునేందుకు ఆ ప్రాంతాలలో తవ్వకాలు జరిపేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే వెంటనే తవ్వకాలు మొదలుపెట్టాలని భావిస్తోంది. అయితే దీనిని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క హరితహారం పేరిట పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతూ పచ్చదనం పెంచేందుకు కృషి చేస్తోంది. అవి పెరిగి వృక్షాలుగా మారేందుకు ఏళ్ళ సమయం పడుతుంది. అటువంటప్పుడు యురేనియం తవ్వకాల కోసం సహజసిద్దంగా పెరిగిన దట్టమైన అడవులను నరికివేయడానికి అనుమతించినట్లయితే రాష్ట్రంలో పచ్చదనం తగ్గిపోతుంది. హరితహారం ఆశయం నెరవేరదు.


Related Post