సిఎం కేసీఆర్‌ నేడు యాదాద్రి పర్యటన

August 17, 2019


img

సిఎం కేసీఆర్‌ నేడు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకోబోతున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణపనులు దాదాపు పూర్తికావచ్చినందున వాటి ఉద్ఘాటనకు ముందు యాదాద్రిలో సుదర్శనయాగం చేయాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాగనిర్వహణకు ఆలయ అధికారులు కొండ దిగువన యాదాద్రికి ఉత్తరం వైపున్న పెద్దగుట్టను ఎంపిక చేసారు. ఆ ప్రాంతం సుమారు 98 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నందున యాగ నిర్వహణకు చాలా అనుకూలంగా ఉంటుందని, ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ యాగం చేయడం శుభప్రదమని వారు నిర్ణయించారు. 

1048 యజ్ఞ కుండాలతో 3,000 మంది రుత్విక్కులు..300 మంది వేదపండితులతో సిఎం కేసీఆర్‌ సుదర్శనయాగం నిర్వహించబోతున్నారు. దేశంలోని తిరుపతి, శ్రీరంగం, బద్రీనాధ్, పూరీ జగన్నాధ్ తదితర వైష్ణవ పుణ్యక్షేత్రాల నుంచి వేదపండితులను, వైష్ణవ పీఠాధిపతులను సుదర్శన యాగానికి ఆహ్వానించబోతున్నారు.   రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులను, గవర్నర్లను ఈ యాగానికి ఆహ్వానించబోతున్నారు.

సిఎం కేసీఆర్‌ ఈరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకొంటారు. బాలాలయంలో ప్రత్యేకపూజలు చేసిన తరువాత పెద్దగుట్టకు చేరుకొని ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. సుదర్శనయాగ నిర్వహణపై నేడు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

యాదాద్రి దిగువన చుట్టూ ఉండే ప్రాంతాలను కూడా టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నందున ఆ అభివృద్ధి పనుల గురించి కూడా నేడు అధికారులతో చర్చించబోతున్నట్లు సమాచారం.


Related Post