వినోద్ కుమార్‌కు ప్రభుత్వంలో కీలక పదవి

August 16, 2019


img

మాజీ ఎంపీ, సీనియర్ తెరాస నేత వినోద్ కుమార్‌కు సిఎం కేసీఆర్‌ తన ప్రభుత్వంలో కీలక పదవిని కట్టబెట్టారు. ఆయనను రాష్ట్ర ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాబినెట్ హోదాలో మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. 

తెరాస ఎంపీగా తెలంగాణ ప్రభుత్వం తరపున గత లోక్‌సభలో వినోద్ కుమార్ కేంద్రప్రభుత్వంతో చాలా గట్టిగా పోరాడారు. రాష్ట్రానికి రావలసిన నిధులు, విభజన హామీల కోసం కేంద్రప్రభుత్వంపై చాలా ఒత్తిడి చేశారు. కానీ 2019 లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. ఇది ఆయనకు, సిఎం కేసీఆర్‌కు, తెరాస పార్టీకి కూడా పెద్ద షాక్ ఇచ్చింది. కనుక ఆయనకు సిఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు. నిజామాబాద్‌ మాజీ ఎంపీ కవిత కూడా బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి రాజకీయాలకు, మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు. బహుశః ఆమెకు కూడా త్వరలోనే సముచిత స్థానం కల్పించవచ్చు. 


Related Post