మీలో ఎవరు తెరాసకు ప్రత్యామ్నాయం? తలసాని

August 13, 2019


img

గత కొన్నిరోజులుగా ‘సైలెంట్ మోడ్’లో ఉన్న తెరాస మంగళవారం కాంగ్రెస్‌, తెరాసలపై ఎదురుదాడి చేసింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “బిజెపి నేతలు మజ్లీస్ పేరు చెప్పి సిఎం కేసీఆర్‌ మీద ఎందుకు విమర్శలు చేస్తుంటారో తెలీదు కానీ వారికి ధైర్యం ఉంటే నేరుగా మజ్లీస్ పార్టీతోనే పోరాడవచ్చు కదా? ఈ డొంకతిరుగుడు పోరాటాలు ఎందుకు?” అని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో వివిద పార్టీల నేతలను చేర్చుకొంటూ బిజెపి బలోపేతం అవుతోందని, వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటున్న బిజెపి నేతల మాటలపై స్పందిస్తూ, “బిజెపిలో ఎంతమందిని చేర్చుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ కాంగ్రెస్‌, బిజెపిలలో తెరాసకు ఏది ప్రత్యామ్నాయమో ముందుగా తేల్చుకుంటే, ఆ తరువాత మమ్మల్ని ఓడించడం గురించి ఆలోచించవచ్చు,” అని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తూ, ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేస్తోందని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్‌, బిజెపి నేతలకు సమాధానం ఇస్తూ, “కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి వంటిది. దాని కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసినా తక్కువే. దాని కోసం తెస్తున్న అప్పులను తీర్చగల శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కనుకనే తీసుకుంటున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అడుగడుగునా అడ్డుతగులుతున్న కాంగ్రెస్ పార్టీకి దాని డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ ఈయవలసిన అవసరం లేదు,” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 

బిజెపిలో చేరిన జి వివేక్ సిఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖండించారు. “కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం సేవలందించి ఆయన తండ్రి వెంకటస్వామిని కాంగ్రెస్‌ పార్టీ గౌరవించకపోయినా మా ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టి గౌరవించింది. కానీ వివేక్ బిజెపిలో చేరగానే సిఎం కేసీఆర్‌ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఆయన కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది,” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.  

రెండు చేతులూ కలిస్తేనే చప్పట్లు మోగుతాయన్నట్లు, కాంగ్రెస్‌, బిజెపిలు ఎన్ని విమర్శలు చేస్తున్నా తెరాస నేతలు స్పందించకపోవడంతో ఆ రెండు పార్టీలు ఆశించిన వేడి పుట్టడం లేదు. ఇప్పుడు తలసాని ఘాటుగా జవాబిచ్చారు కనుక కాంగ్రెస్‌, బిజెపిలు మళ్ళీ యుద్ధం ప్రారంభించవచ్చు. 


Related Post