కొందరికి అర్ధం కాదు..మరికొందరికి జీర్ణం కాదు: కేసీఆర్‌

August 12, 2019


img

సిఎం కేసీఆర్‌ కుటుంబ సమేతంగా సోమవారం తమిళనాడులోని కాంచీపురంలో అత్తివరదరాజస్వామివారిని దర్శించుకొని తిరిగివస్తూ మార్గమద్యంలో వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించారు. అనంతరం ఆమె నివాసం వద్ద విలేఖరులతో మాట్లాడుతూ, “నా కుమార్తె రోజా మాకు చక్కటి ఆతిధ్యం ఇచ్చింది. అందుకు ఆమెను మనసారా ఆశీర్వదిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పట్టుదల, చిత్తశుద్ది ఉన్న ముఖ్యమంత్రి లభించాడు. కనుక ఏపీలో అభివృద్ధి వేగం పుంజుకొంటుంది. రాయలసీమ నీటి కష్టాలు...వాటిని ఏవిధంగా పరిష్కరించాలో నాకు బాగా తెలుసు. ఆ దిశలో రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగబోతున్నాయి. రాయలసీమకు నీళ్ళను అందించడం గురించి మేము చేస్తున్న ఆలోచనలు కొందరికి అర్ధం కావు...మరికొందరికి అర్ధమైనా జీర్ణం కావు. మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలా సహాయసహకారాలు అందజేస్తుంది,” అని అన్నారు. 

గోదావరి జలాలను శ్రీశైలం తరలించడం ద్వారా కృష్ణా ఆయకట్టును స్థిరీకరించుతూ, రాయలసీమకు నీళ్ళు అందించాలనే ప్రతిపాదనపై రెండు తెలుగు రాష్ట్రాల సాగునీటిశాఖ అధికారులు, ఇంజనీర్లు కసరత్తు చేస్తున్నారు. వారి ప్రాధమిక అంచనా ప్రకారం ఇది కాళేశ్వరం ప్రాజెక్టు కంటే చాలా ఖరీదైన వ్యవహారంగా ఉంటుందని తేలింది. కనుక రెండు రాష్ట్రాలతో ముడిపడిన ఈ భారీ ప్రాజెక్టుపై ఏవిధంగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు సాగుతున్నాయి. ఈ ప్రతిపాదనను ఏపీ కాంగ్రెస్‌, టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. బహుశః వారిని ఉద్దేశ్యించే సిఎం కేసీఆర్‌ ‘వారికి అర్ధం కాదు..జీర్ణం కాదని’ విమర్శలు చేశారనుకోవచ్చు.


Related Post