షీలా దీక్షిత్ ఇక లేరు

July 20, 2019


img

మాజీ డిల్లీ సిఎం, సీనియర్ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్ (81) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె పార్ధివ దేహాన్ని ఆసుపత్రి నుంచి ఆమె నివాసానికి తరలించారు. పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్ధం ఆదివారం ఉదయం ఆమె పార్ధివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యాలయంలో ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచే ఆమె అంతిమయాత్ర మొదలవుతుంది. 

షీలా దీక్షిత్ 1984లో రాజకీయాలలోకి ప్రవేశించి తన ప్రతిభ, నాయకత్వ లక్షణాలతో అంచెలంచెలుగా ఎదిగారు. ఆమె ప్రతిభను గుర్తించిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఆమెను యునైటెడ్ నేషన్స్ కమీషన్‌లో భారత్ ప్రతినిధిగా నియమించారు. ఆమె 1998లో డిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఏకధాటిగా 15 ఏళ్ళపాటు డిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమెను కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించింది. కానీ ఆ ఎన్నికలలో బిజెపి చేతిలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో ఆమె ఒక గొప్ప అవకాశం కోల్పోయారు. చనిపోయే సమయానికి ఆమె డిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. షీలా దీక్షిత్ భర్త వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. కొంతకాలం క్రితం ఆయన కూడా గుండెపోటుతో మరణించారు. వారి కుమారుడు సందీప్ దీక్షిత్ 15వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. వారి కుమార్తె పేరు లతికా సయ్యద్. 

షీలా దీక్షిత్ ఆకస్మిక మృతికి ప్రధాని నరేంద్రమోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, పలువురు కాంగ్రెస్‌ నేతలు, అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు.


Related Post