కేసీఆర్‌ వ్యాఖ్యలపై బిజెపి ఫైర్

July 19, 2019


img

మొన్న ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సిఎం కేసీఆర్‌ మంత్రులతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో జాతీయవాదం, జాతీయభద్రత వంటి అంశాలను హైలైట్ చేసి దేశప్రజలలో సెంటిమెంటు రగిల్చి విజయం సాధించారు. ఆదేమైనా గొప్ప విషయమా? గత ఐదేళ్ళ పాలన ప్రధాని నరేంద్రమోడీ దేశాన్ని ఏమి అభివృద్ధి చేశారు? మనం ఇక్కడ రాష్ట్రంలో అభివృద్ధి చేసినా కొన్ని సీట్లు కోల్పోయాము. రాష్ట్రంలో బిజెపిది యాక్సిడెంటల్ విజయమే తప్ప నిజమైన విజయం కాదు. రాష్ట్ర ప్రజలందరూ మనవైపే ఉన్నారని పరిషత్ ఎన్నికలలో స్పష్టం అయ్యింది. త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో కూడా మనమే గెలుస్తాము. బిజెపి నేతల తాటాకు చప్పుళ్ళకు మనం భయపడనవసరం లేదు,” అని అన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి. 

కేసీఆర్‌ వ్యాఖ్యలపై సహజంగానే బిజెపి తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ, “ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశ్యించి సిఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖలను మేము ఖండిస్తున్నాం. దేశప్రజలు ఇచ్చిన తీర్పును అవమానిస్తున్నట్లున్నాయి ఆయన మాటలు. అయినా దేశభక్తి, జాతీయవాదం గురించి ప్రజలను చైతన్యపరిస్తే తప్పేమిటి? సిఎం కేసీఆర్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రాంతీయవాదం, మతతత్వవాదంతో ప్రజలలో సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేయలేదా? రాష్ట్రంలోని ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మజ్లీస్ పార్టీని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడం వాస్తవమా కాదా? లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసి ఆయనలో తీవ్ర భయాందోళనలు, అభద్రతాభావం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రియల్ ఎస్టేట్ పార్టీ అన్నట్లుగా తయారైంది. రాష్ట్రంలో 29 జిల్లాలలో తెరాస కార్యాలయాలు నిర్మించుకోవడానికి అప్పనంగా భూములు కేటాయించుకున్నారు. వాటి విలువ, ప్రభుత్వం వాటి కోసం మంజూరు చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.  

బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూసినప్పటి నుంచి సిఎం కేసీఆర్‌కు మోడీ ఫోబియా పట్టుకొంది. రాష్ట్రంలో బిజెపి ఎదుగుదలను చూసి కేసీఆర్‌ భయపడుతున్నారు. కానీ పార్టీ కార్యకర్తలకు ధైర్యం కలిగించడానికే ప్రధాని నరేంద్రమోడీపై అటువంటి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశప్రజలకు నరేంద్రమోడీపై నమ్మకం పెరిగినందునే 303 సీట్లతో మళ్ళీ గెలిపించారనే విషయం సిఎం కేసీఆర్‌ గ్రహిస్తే మంచిది,” అని అన్నారు.


Related Post