సిరిసిల్ల మున్సిపాలిటీ...శభాష్!

July 19, 2019


img

గతంలో ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాలు అనేక సంక్షేమ పధకాలను అమలుచేసినప్పటికీ అవన్నీ మొక్కుబడి వ్యవహారాలుగానే ఉండేవని అందరికీ తెలుసు. తెరాస సర్కారు కూడా అటువంటి సంక్షేమ పధకాలనే అమలుచేస్తున్నప్పటికీ, వాటికి మానవత్వపు విలువలను జోడించడం వలన అవి చాలా అమూల్యమైనవిగా మారాయి. చాలా ప్రజాధారణ పొందుతున్నాయి. వాటివలన ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందని చెప్పవచ్చు. ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాదిగ్రస్తులకు పింఛనులు ఇవ్వడం, బతుకమ్మ పండుగకు పేద మహిళలకు చీరలు ఇవ్వడం, వాటితోనే రాష్ట్రంలో నేత కుటుంబాలకు ఉపాధి కల్పించడం వంటివి కొన్ని ఉదహారణాలుగా చెప్పుకోవచ్చు. 

రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పాలనలో మానవతా దృక్పదంతో నిర్ణయాలు తీసుకోవడం మొదలైందని చెప్పవచ్చు. అటువంటి గొప్ప ఆలోచనే ‘ఫీడ్ డ్‌ నీడ్’ కార్యక్రమం. తొలుత హైదరాబాద్‌ నగరంలో జీహెచ్‌ఎంసీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద రూ.2.50 లక్షల వ్యయంతో ‘ఆపిల్ హోమ్’ పేరిట ఒక ఆహార నిలువ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దానిలో ఒక పెద్ద ఫ్రిజ్‌ను ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ దీనిని గురువారం ప్రారంభించారు. 


పట్టణంలో ప్రజలు, హోటల్స్, తినుబండారాల షాపులు, కూరగాయల దుకాణాల వాళ్ళు తమ వద్ద పాడైపోకుండా మిగిలిపోయిన పాలు, పండ్లు, కూరగాయలు, ఆహార పదార్ధాలను ఈ ఆపిల్ హోమ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్రిజ్‌లో ఉంచి వెళ్లవచ్చు. అలాగే పెళ్ళిళ్ళు, శుభకార్యాలలో మిగిలిపోయిన ఆహార పదార్ధాలను కూడా ఇక్కడ పెట్టి వెళ్లవచ్చు. పట్టణంలో ఆకలితో అలమటిస్తున్నవారు ఎవరైనా వచ్చి వాటిని తీసుకొని తినవచ్చునని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ అన్నారు. విలువైన ఆహారపదార్ధాలను చెత్తకుండీలలో, మురికి కాలువలలో పడేయడం కంటే వాటిని ఆకలితో అలమటిస్తున్నవారికి అందజేయాలనే ఆలోచన అభినందనీయం.


Related Post