ప్రభుత్వాసుపత్రులలో 3,000 పోస్టులు త్వరలో భర్తీ

July 18, 2019


img

తెలంగాణలోని ప్రభుత్వాసుపత్రులలో ఖాళీల భర్తీ ఆలస్యం అవుతుండటంతో, ఆసుపత్రులలో సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కొన్ని ఆసుపత్రులను సందర్శించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌, వెంటనే తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఈ సమస్యపై వారితో లోతుగా చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, ఏరియా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలలో 4,000 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2017-18లో నోటిఫికేషన్‌ విడుదల చేసి ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ షరామామూలుగా దానిపై కూడా హైకోర్టులో అనేక పిటిషన్లు దాఖలవడంతో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతోందని అధికారులు మంత్రికి వివరించారు. కనుక ఆసుపత్రులలో సిబ్బంది కొరతను అధిగమించడానికి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టడం మంచిదని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రులకు కలిపి 3,000 మందిని నియమించాలని మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. వారిలో సుమారు 2,000 మంది స్టాఫ్ నర్సులను, మిగిలిన 1,000 పోస్టులలో ఫార్మాసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, క్లీనింగ్ సిబ్బందిని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. త్వరలోనే ఈ తాత్కాలిక ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టబోతునట్లు సమాచారం. 


Related Post