కులభూషణ్ ఉరిశిక్ష నిలిపివేసిన ఐసిజె

July 17, 2019


img

గూడచర్య ఆరోపణలతో పాక్‌ చెరలో చిక్కుకున్న భారత్‌ మాజీ నేవీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు పాకిస్తాన్ మిలటరీ కోర్టు విధించిన ఉరిశిక్షను నిలిపివేస్తూ అంతర్జాతీయ నాయస్థానం (ఐసిజె) ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై భారత్‌, పాక్‌ న్యాయవాదులు ఐసిజెలో తమ వాదనలు వినిపించగా, ఐసిజెలో గల 16 మంది న్యాయమూర్తులలో 15 మంది భారత్‌ వాదనలతో ఏకీభవిస్తూ కులభూషణ్ జాదవ్‌కు విదించిన ఉరిశిక్షను పాకిస్తాన్ ప్రభుత్వం పునః సమీక్షించేవరకు నిలిపివేస్తున్నట్లు తీర్పు చెప్పారు. 

 కులభూషణ్ జాదవ్‌ విషయంలో భారత్‌, పాక్‌ వాదనలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మాజీ నేవీ అధికారి అయిన అతను పాకిస్తాన్‌లో గూడచర్యంకు పాల్పడుతుండగా పట్టుబడ్డాడని, కనుక తమ దేశ చట్టాల ప్రకారం అతనికి ఉరిశిక్ష విధించడం సబబేనని పాక్‌ వాదన. 

వ్యాపార పనులమీద ఇరాన్ వెళ్ళిన అతనిని పాకిస్తాన్ కిడ్నాప్ చేయించి తీసుకువచ్చి, అతనిపై గూడఛారి ముద్రవేసి, చిత్రహింసలు పెట్టి అతని చేత బలవంతంగా తాను భారత్‌ గూడచారినని ఒప్పించిందని భారత్‌ వాదన. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ చేస్తున్న పోరాటాల కారణంగా ఏకాకిగా మారుతున్న పాకిస్థాన్‌, భారత్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ దారుణానికి పాల్పడిందని భారత్‌ ఆరోపిస్తోంది. 

కులభూషణ్ జాదవ్‌ ప్రాణాలు పోకుండా భారత్‌ కాపాడుతున్నప్పటికీ, పాకిస్తాన్ చెరలో అతను రోజూ ఎన్ని చిత్రహింసలు అనుభవిస్తున్నాడో ఎవరూ ఊహించలేరు. కనుక అతను తిరిగి స్వదేశం చేరుకున్నప్పుడే భారత్‌ చేస్తున్న పోరాటం 100 శాతం ఫలించినట్లవుతుంది.


Related Post